జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయ్. అవినీతి, దోపిడి ప్రభుత్వాన్ని తరిమేయాలని ఒకవైపు చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై పవన్ బహిరంగసభల్లో ఊదరగొడుతున్నారు. మరోవైపు టిడిపికే చెందిన రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఆర్ధిక నేరాలు ఆధరాలతో సహా బయటపడినా ఇంత వరకూ పవన్ నోరెత్తలేదు. ప్రతిపక్షాలన్నీ సుజనా చౌదరిని పార్టీలో నుండి సస్పెండ్ చేయాలని, రాజ్యసభ స్ధానం నుండి తప్పించాలంటూ డిమాండ్ చేశాయి. చంద్రబాబుకు జనసేనే నిజమైన ప్రతిపక్షమని పవన్ చెప్పుకుంటున్నారు కదా ? మరి అది నిజమే అయితే సుజనా గురించి ఎందుకు మాట్లాడటం లేదు ?

 

వివిధ బ్యాంకుల నుండి వందల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఎగొట్టిన చరిత్ర సుజనాది. మారిషస్ బ్యాంకులో తీసుకున్న రూ 100 కోట్ల అప్పును ఎగొట్టినపుడే సుజనా బతుకేంటో అందరికీ ఆధారాలతో సహా కనబడింది. ఆ కేసులో సుజనాకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు కూడా నాంపల్లి కోర్టు జారీ చేసిన విషయం తెలిసిందే. కాకపోతే అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏదో తంటాలు పడి అరెస్టు వారెంటును రీకాల్ చేయించుకున్నారు. మొదటి నుండి కూడా చంద్రబాబుకు సుజనా బినామీ అనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

 

తాజాగా సుజనా కార్యాలయాలు, ఇళ్ళపై దాడులు జరిపిన ఎనఫోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడి) ఉన్నతాధికారులు కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో బ్యాంకుల దగ్గర తీసుకున్న రూ 6 వేల కోట్ల రూపాయల రుణాలు, ఎగొట్టిన వివరాలన్నీ దొరికాయి. దాంతో సుజనాపై ఈడి లుకౌట్ నోటీసు కూడా జారీ చేసింది. అంతేకాకుండా 6 లగ్జరీ కార్లను కూడా సీజ్ చేసింది. ఈరోజు అంటే మంగళవారం చెన్నైలోని ఈడి కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసు కూడా ఇచ్చింది.


రేపో మాపో సుజనా అరెస్టు కూడా తప్పదనే ప్రచారం ఊపందుకుంది. సుజనా విషయంలో చంద్రబాబు అండ్ కోలో టెన్షన్ పెరిగిపోతోంది. టిడిపిలో ఇంత టెన్షన్ పెరిగిపోతున్నా పవన్ మాత్రం ఇప్పటి వరకూ ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం గమనార్హం. పవన్ చెప్పుకుంటున్నట్లు చంద్రబాబు దోపిడిపై పోరాడేది తానొక్కడినే అన్నది నిజమైతే సుజనా మోసాలపై ఎందుకు మాట్లాడటం లేదు ? చంద్రబాబు అండ లేకుండా సుజనా వేల కోట్ల రూపాయల మోసాలకు బరితెగించేవాడా ? సుజనా లాంటి బినామీలు టిడిపిలో చాలామంది ఉన్నారన్న ప్రచారం నేపధ్యంలో పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు ?


అంటే చంద్రబాబుకు వ్యతిరేకంగా పవన్ చేస్తున్న పోరాటమంతా సినిమాలో ఉత్తుత్తి ఫైటింగ్ లాంటిదేనా ? ఇప్పుడందరిలో ఇటువంటి అనుమానాలే పెరిగిపోతున్నాయి. ఏదో మొహమాటానికి చంద్రబాబుపై మాట్లాడుతున్నారే కానీ  పవన్ అసలైన టార్గెట్ జగన్మోహన్ రెడ్డే అన్న విషయం అర్ధమైపోయింది. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకున్నదంటే అర్దమేంటి ? అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నట్లే అన్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. లేకపోతే రాష్ట్రమంతా గగ్గోలు పెడుతున్న సుజనా వేల కోట్ల రూపాయల మోసంపై పవన్ ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడలేదో సమాధానం  చెప్పాల్సింది పవనే. మరి చెబుతాడా ? లేకపోతే ఈడి దాడులపై తనకు పూర్తి సమాచారం లేదు కాబట్టి ఏమీ మాట్లాడలేదని తప్పించుకుంటాడా ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: