ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్రమోడి సిఎం కెసియార్ గాలి తీసేశారు. నిజామాబాద్ సభలో మోడి మాట్లాడుతూ, కెసియార్ లో ఆత్మవిశ్వాసం మచ్చుకు కూడా కనబడలేదన్నారు. అభద్రతాభావంతో ఆత్మవిశ్వాసం లోపించటంతో  కెసియార్ ఎక్కువగా నిమ్మకాయల, మిరపకాయలనే నమ్ముకున్నట్లు ఎద్దేవా చేశారు. పేదల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వ తెచ్చిన ఆయుష్మాన్ భవ పథకాన్ని తెలంగాణాలో ఎందుకు అమలు చేయలేదో కెసియార్ సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. ఆ పథకం వల్ల దేశవ్యాప్తంగా 3 లక్షల మంది ప్రాణాలను కాపాడగలిగినట్లు ప్రధాని చెప్పారు.


ఒకవైపు కెసియార్ ను విమర్శిస్తూనే మరోవైపు కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. అదే సమయంలో కాంగ్రెస్ ను విమర్శించారే కానీ మహాకూటమి గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ తమ విధానంగా వివరించారు. విద్య, ఉపాధి, ఆదాయం పెంచటం, వృద్ధులకు అండగా నిలబడటం, ప్రతీ ఎకరాకు నీరివ్వటం బిజెపి లక్ష్యంగా ముందుకు పోతుందని చెప్పారు. పాలనా పరంగా తాము ముందుకు పోతుంటే తెలంగాణాలో కెసియార్ వి మాత్రం అన్నీ వైఫల్యాలంటూ మండిపడ్డారు. పాలన కూడా పూర్తి కాలం చేయలేకపోయారంటూ ఎద్దేవా చేశారు.

 

కెసియార్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం వల్ల ప్రజలకు సమస్యల నుండి ముందుగా విముక్తి లభించిందన్నారు. ప్రతీ ఇంటికీ తాగునీరిచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతానని శపధం చేసిన కెసియార్ ఐదేళ్ళు కావస్తున్న నీళ్ళెందుకు ఇవ్వలేకపోయారంటూ నిలదీశారు. నీళ్ళు ఇవ్వలేకపోయినా ఓట్ల ఎలా అడుగుతున్నారంటూ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను మరచిపోయినా కెసియార్ ను జనాలు ఇంటికి పంపాలంటూ పిలుపిచ్చారు. కెసియార్ కూడా యుపిఏ ఉప్పు తిన్న వ్యక్తే అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ ఇద్దరిదీ దొంగాటేనన్నారు. సోనియా, కెసియార్ ఫ్రెండ్లీ మ్యాక్ ఆడుతున్నట్లు చెప్పారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: