ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎన్నికల ప్రచారంలో కెసియార్ కు మహాకూటమిలో ధీటైన నేత ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే. తన పంచులతో, డైలాగులతో, వాడి వేడి వాగ్బాణాలతో ప్రత్యర్ధులపై విరుచుకుపడ రేవంత్ అంటే జనాల్లో మంచి క్రేజుంది. పార్టీ నేతలు, శ్రేణుల్లో కూడా రేవంత్ వస్తున్నాడన్నా, మాట్లాడుతున్నాడన్న తెలియని జోష్ కనబడుతుంది. మొదటి నుండి కెసియార్ అండ్ కోను ముప్పుతిప్పలు పెడుతున్నది ఒక్క రేవంత్ మాత్రమే అనటంలో సందేహం అవసరం లేదు. అటువంటి రేవంత్ ఎన్నికల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

 

ఒకవైపు కెసియార్ రోజుకు ఆరు బహిరంగసభల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఎన్నకల తేదీ దగ్గర పడుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ కు కూడా ఓ హెలికాప్టర్ ను  కేటాయించింది. దాంతో రేవంత్ కూడా రెచ్చిపోతున్నారు. మొదటసారి పోటీలో నిలబడిన అభ్యర్ధులే కాకుండా సీనియర్ నేతలు కూడా రేవంత్ ను తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి రావాల్సిందిగా కోరుతున్నారంటే రేవంత్ కు ఎంత డిమాండ్ ఉందో అర్ధమవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే బహిరంగసభలు, రోడ్డుషోలు మొదలుపెట్టేశారు. కాకపోతే మహాకూటమిలో టిక్కెట్ల లొల్లి, అభ్యర్ధుల కేటాయింపు లాంటి వాటివల్ల మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ను పూడ్చటానికే అధిష్ఠానం హెలికాప్టర్ ను కేటాయించింది.

 

సీనియర్లు అయిన జానారెడ్డి నియోజకవర్గం నాగార్జునసాగర్ లో ఓ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. మాజీ మంత్రులు గీతారెడ్డి, షబ్బీర్ ఆలి, సునీతా లక్ష్మారెడ్డి తదితరుల నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు కాకుండా రోడ్డుషోలు నిర్వహించారు. సరే బహిరంగసభ అయినా రోడ్డు షో అయినా టార్గెట్ మాత్రం కెసియార్ మాత్రమే అన్నది అందిరకీ తెలిసిందే. హెలికాప్టర్ సౌలభ్యం కూడా ఉండటంతో రేవంత్ రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. దాంతో చుట్టుపక్కల నియోజకవర్గాల్లోని అభ్యర్ధులు, నేతలు, క్యాడర్లో కూడా హుషారొస్తోంది.

 

ఇప్పటి వరూ ఆదిలాబాద్ జిల్లాలోని అసిఫాబాద్, ఖానాపూర్, బోధ్, కరీనంగర్ జిల్లాలోని చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ, వరంగల్ జిల్లాలోని ములుగులో బహిరంగసభల్లో పాల్గొన్నారు. ఇవికాకుండా మరో 15 నియోజకవర్గాల్లో రోడ్డుషోల్లో కూడా పాల్గొన్నారు. సభల్లో  కెసియార్ పై టార్గెట్ పెట్టినపుడు రేవంత్ మాటల్లోని పదునుకు అందరూ ఫిదా అయిపోతున్నారు. రేపటి ఎన్నికల్లో రేవంత్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఎంతమంది గెలుస్తారో ఇపుడే చెప్పేందుకు లేదు. ఏదేమైనా రేవంత్ కాంగ్రెస్ నేతగా మహాకూటమిలో పెద్ద అసెట్ అనే చెప్పాలి.

 

ఒకవేళ మహాకూటమి గనుక గెలిస్తే తెలంగాణా మొత్తం మీద రేవంత్ కు ఇక తిరుగన్నదే ఉండదు. ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటారో లేకపోతే ఇంకెవరైనా అవుతారో కూడా చెప్పలేం. రేవంత్ ను అయితే మంత్రివర్గంలోకి తీసుకోక తప్పదు. సిఎంగా ఎవరున్నా రేవంత్ ముందు డమ్మీలే అయిపోతారనటంలో సందేహం లేదు. కాకపోతే రేవంత్ ప్రవర్తన ఎలాగుంటుందన్నదే అప్పుడు కీలకమవుతుంది. జాగ్రత్తగా కాస్త తగ్గి ఉంటేనేమో సిఎంలకు ఎవరికీ ఇబ్బందుండదు. లేకపోతే మాత్రం గ్రూపుల గోల పెరిగిపోవటం ఖాయం. ఒకవేళ ప్రతిపక్షానికే పరిమితమైనా రేవంత్ కు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు. కాకపోతే అసెంబ్లీలో కెసియార్ ను ఎదుర్కొనేటపుడు కాస్త పట్టువిడుపులు ప్రదర్శిస్తే చాలా రేవంత్ కు తిరుగే ఉండదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: