ఏ రోటి కాడ ఆ పాట పాడటం తెలుగుదేశంపార్టీకి బాగా అలవాటే. నాలుగున్నరేళ్ళు ఏపిలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర విభజన చేసినందుకు చంద్రబాబునాయుడు కాంగ్రెస్ ను తిట్టని రోజంటూ లేదు. సోనియాగాంధిని అమ్మనాబూతులు తిట్టిన తిట్ట కుండా తిట్టిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజనను అడ్డుగోలుగా చేశారంటూ ఎన్ని సభల్లో కాంగ్రెస్ ను తిట్టారో లెక్కేలేదు.  సీన్ కట్ చేస్తే, అదే కాంగ్రెస్ తో నిసిగ్గుగా ఇపుడు పొత్తు పెట్టుకున్నారు. జాయింట్ మీటింగుల్లో పాల్గొంటున్నారు. ఖమ్మంలో జరిగిన బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహూల్ గాంధితో కలిసి వేదికను కూడా పంచుకున్నారు.


తాజాగా ఖమ్మం బహిరంగ సభలో ఎంఎల్ఏ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఇచ్చిన చారిత్రాత్మకమన్నారు. చంద్రబాబు లేఖ ఇవ్వటం వల్లే ప్రత్యేక తెలంగాణా ఏర్పాటైందన్నారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో పార్లమెంటులో జరిగిన ఓటింగ్ సమయంలో మొదటి ఓటు వేయాలని చంద్రబాబు తనకు చెప్పినట్లు నామా చెప్పటం విశేషం. సమైక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలంగా రెండుసార్లు లేఖలు ఇచ్చిన విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని నామా చెప్పారు. రాష్ట్ర విభజన విషయాలను నామా  వివరిస్తున్నపుడు చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వుకోవటం గమనార్హం.

 

మళ్ళీ సీన్ కట్ చేస్తే, ఏపిలో తిరిగినపుడేమో రాష్ట్ర విభజనకు తనకు ఏమీ సంబంధం లేదని చంద్రబాబు కొన్ని వందలసార్లు చెప్పారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీని కనీసం సంప్రదించకుండానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించేసిందని దొంగేడుపులేడ్చారు. కాంగ్రెస్ ను శాపనార్ధాలు పెట్టారు. కట్టుబట్టలతో సీమాంధ్రులను రోడ్డున పడేసిందంటూ మండిపడ్డారు. అప్పట్లోనే అదే సమయంలో తెలంగాణాలోని మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో పర్యటించినపుడు చంద్రబాబు తామిచ్చిన లేఖల వల్ల తెలంగాణా ఏర్పడిందని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు తానెంత కృషి చేసింది ఎన్నోసార్లు చెప్పారు.  అంతా చంద్రన్న మాయాజాలం. అదృష్టం ఉన్నంత కాలం ఏం మాట్లాడినా చెల్లుబాటవుతుంది. ఏం చేద్దాం ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: