తెలంగాణా ఎన్నికలకు ఇంక మరో తొమ్మిది రోజులే గడువు ఉంది. ప్రచారానికైతే కచ్చితంగా వారం మాత్రమే సమయం ఉంది. దాంతో తెలంగాణా ఎన్నికల వేడి  వేసవి తాపాన్ని మించిపోతోంది. చలికాలంలో సమ్మర్ ని తెస్తోంది. జాతీయ నాయకులైతే క్యూ కడుతున్నారు. ప్రతీ చోటా కోలాహలమే. ప్రతి రోడ్డు సందడే. ఎక్కడ చూసినా మీటింగులే. నేతలు ఒకరిని ఒకరు నిందించుకోవడం, తమ పార్టీ గొప్పలు చెప్పుకోవడంతో ప్రచారం హోరెత్తిపోతోంది.


సోనియాతో స్టార్ట్ :


ఈ నెల 23న సోనియాగాంధితో తెలంగాణా ప్రచారం ఓ స్థాయికి వెళ్ళింది. ఆమె మేడ్చల్ సభతో ఎన్నికల సమరాన్ని తార స్థాయికి తీసుకెళ్ళారు.  టేయారెస్ మీద నిప్పులు చెరుగుతూ సాగిన ఆ ప్రసంగంతో వాతావర‌ణం ఒక్కసారిగా మారిపోయింది. అంతవరకూ వన్ సైడెడ్ గా సాగుతున్న పోరు కాస్తా రెండు వైపులా మోహరించే స్థాయికి చేరుకుంది. ఆ తరువాత నిన్న (మంగళవారం) మోడీ ప్రచారానికి రావడంతో మరింతగా వేడి పెరిగింది. ఆయన అన్ని పార్టీలను ఒక గాటకు కట్టేసి బీజేపీ కే ఓటు వేయమంటూ పిలుపు ఇచ్చారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీరు వేరుగా ఉంది. ఆయన ఏకంగా మజ్లిస్ పార్టీని టార్గెట్ చేస్తూ ప్రసంగాలు చేస్తున్నారు.


రాహుల్..బాబు జోడీ :


ఈ ఎన్నికల్లో హైలెట్ గా మరో జంట కనిపిస్తున్నారు. మూడున్నర దశాబ్దాల పాటు కత్తులు దూసుకున్న కాంగ్రెస్, టీడీపీ ఒక్కటిగా కలసి కనిపిస్తున్నారు. రాహుల్, చంద్రబాబు కలసి ఒకే వేదికను పంచుకుని ఈ రోజు తెలంగాణా ప్రచారానికి రావడంతో ఎన్నికల పోరాటం సరి కొత్త మలుపు తిరిగింది. ఈ ఇద్దరు కలయిక వల్ల క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్, టీడీపీ పార్టీల నేతలకు సరికొత్త ఉత్సాహం వచ్చినట్లైంది. కేసీయర్ ని గురిపెట్టి మరీ ఈ ఇద్దరు నేతలు వాడీ వేడీ ప్రసంగాలు చేశారు.


వారే స్టార్లు :


ఇక టీయారెస్ కి సంబంధించి చూస్తే కేసేఅర్, కేటీయార్ స్టార్ కాంపెనియర్లుగా ఉంటున్నారు. ఈ ఇద్దరే చాలు పది మంది పెట్టు అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. రోజుకు కనీసం పది వరకూ సభలూ రోడు షోలను కేటీయార్ కవర్ చేస్తూంటే మూడు నుంచి నాలుగు మీటింగులలో కేసీయార్ పాలు పంచుకుంటున్నారు. అన్ని పార్టీల నుంచి వచ్చే ప్రశ్నలకు ఈ ఇద్దరు నాయకులే జవాబు చెబుతున్నారు. మొత్తానికి చూసుకుంటే తెలంగాణా ప్రచారం తుది ఘట్టానికి చేరుకుందనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: