తెలంగాణా అభివ్రుధ్ధిలో తన ముద్ర తప్పనిసరిగా ఉంటుందని, ముఖ్యంగా హైదరాబాద్ ప్రగతి గతి మార్చింది తానేనని గర్వంగా చెబుతానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు తాను హైదరాబాద్ కట్టానా అని టీయారెస్ అధినేత కేసీయార్ ఎద్దేవా చేశారని, కానీ తాను సైబరాబాద్ కట్టానని, ఇది చారిత్రక వాస్తవమని, దీన్ని కేసీయార్ కాదనగలరా అని సూటిగా నిలదీశారు. తెలంగాణాలో ఈ రోజు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలసి చంద్రబాబు ప్రజా కూటమి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖమ్మం, సనత్ నగర్, నాంపల్లి నియోజకవర్గాల్లో మీటింగులు, రోడ్ షోలతో చంద్రబాబు దూసుకుపోయారు. 


వేయిశాతం  విజయం :


ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజా కూటమి విజయంపై ధీమా వ్యక్తం చేశారు. వేయి శాతం  విజయం తమ వైపే ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలసి పోరాడడాన్ని ఆయన సమర్ధించుకున్నారు. దేశంలోని వ్యవష్తలు అన్నీ మోడీ  సర్వ నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. అటువంటి మోడీకి కేసీయార్ రహస్య మిత్రుడని బాబు హాట్ కామెంట్స్ చేశారు. విభజన హామీలు అడగలేని కేసీయార్ మోడీకి సలాం చేస్తారని ఎద్దేవా చేశారు. తాను చేసిన అభివ్రుధ్ధిని సైతం కొనసాగించలేదని చంద్రబాబు అన్నారు. మిగులు బడ్జెట్ తో తాను తెలంగాణాను అప్పగించానని, దాన్ని అప్పుల పాలు చేసింది కేసీయార్ అని దుయ్యబెట్టారు.


అండగా ఉంటా :


విభజన వల్ల రెండు రాష్ట్రాలు అయినప్పటికీ తనకు తెలంగాణా అంటే మమకారమని బాబు చెప్పుకున్నారు. అక్కడా ఇక్కడా ఉన్నది తెలుగు జాతేనని బాబు అంటూ వారికి అండగా తాను ఎపుడూ ఉంటానని చెప్పుకొచ్చారు. తాను పెత్తనం చేస్తానని కేసీయార్ అనడాన్ని తప్పు పట్టారు. తాను తెలంగాణాలో పోటీ చేయడంలేదని, ఇక్కడ తాను పెత్తనం చేయడం అన్న సమస్యే ఉండదని చెప్పారు. అయితే తాను ఈ ప్రాంతం అభివ్రుద్ధిని మాత్రం కోరుకుంటానని చంద్రబాబు అన్నారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా తెలంగాణాతో తనకు ఎంతో అనుబంధం ఉందని బాబు చెప్పారు.  కేసీయార్ ప్రజా వ్యతిరేక విధానాలే తమ కూటమి బలం అని కూడా బాబు చెప్పుకొచ్చారు. మొత్తానికి చాలా కాలం తరువాత బాబు జోష్ తో వాడి వేడి ప్రసంగాలు తెలంగాణా గడ్డ మీద చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: