తెలంగాణాలో రాహుల్ గాంధి ప్రసంగం మొత్తం కేసీయార్ పైనే గురి పెట్టారు. ఈ రోజు ఉదయం కొడంగల్ అసెంబ్లీ కోస్లీ దగ్గర మొదలుపెట్టిన రాహుల్ మాటల యుధ్ధం రోజంతా కొనసాగించారు. మోడీకి నమ్మిన బంటు కేసీయార్ అని, ఆయనకు ఓటు వేస్తే చేటేనని రాహుల్ గాంధి అన్నారు. మోడీ, కేసీయార్ జోడీ నుంచి ముందు తెలంగాణాను విడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ తో ఎపుడూ కేసీయార్ లేరని, ఆయన ఉన్నది, ఉంటున్నది కూడా మోడీ, బీజేపీ నీడనేనని సెటైర్లు వేశారు.


ఇక్కడ గెలుపుతో :


కాంగ్రెస్, టీఆర్ఎస్‌కు తేడా లేదని ఇటీవల తెలంగాణలో మోదీ చెప్పారని, లోక్‌సభ, రాజ్యసభలో బీజేపీకి సంబంధించిన ప్రతి బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తే కేసీఆర్ ప్రభుత్వం మద్దతిచ్చిందన్నారు. నోట్ల రద్దుకు, రాష్ట్రపతి ఎన్నికలలో, నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టినప్పుడు, గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఇలా ప్రతి ఒక్క అంశంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతూ వస్తుంటే టీఆర్ఎస్ మద్దుతిస్తూ వచ్చిందని మండిపడ్డారు. టీఆర్ఎస్, ఎంఐఎం రెండు పార్టీలు బీజేపీ గెలవాలని కోరుకుంటున్నాయని, ప్రజాకూటమిలో ఉన్న పార్టీలన్నీ కలిసి వీరిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఓడిస్తేనే డీల్లీలో మోడీని ఓడించండం సులువు అవుతుందని రాహుల్ చెప్పుకొచ్చారు.


కుటుంబ పాలన :


రాహుల్ తరచూ తన ప్రసంగాల్లో కేసీయార్ కుటుంబ పాలన గురించి ప్రస్తావిస్తున్నారు. తెలంగాణాకు నీళ్ళు,నిధులు, నియామకాలు కోసం ఓటేస్తే కేసీయార్ వాటిని పక్కన పెట్టి కుటుంబాన్ని పెంచి పోషించారని హాట్ కామెంట్స్ చేశారు. కేసీయార్ లక్ష ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ వాటిని అమలు చేయలేకపోయారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్ మాఫియాలా తయారయ్యిందని ఆరోపించారు. కేసీఆర్ నాలుగు సార్లుగా చేసిన రుణమాఫీ వల్ల రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని, కాంగ్రెస్ వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని, 17 పంటలకు మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చారు. 

తెలంగాణ కోసం పోరాడిన వారందరిని కేసీఆర్ మర్చిపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలంగాణ అమర వీరులకు, ఉద్యమకారులకు పది లక్షల రూపాయలు ఇస్తామని, వారిపై ఉన్న కేసులను కూడా ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. మహిళలు లేకుండా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోలేదని, కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలలో డ్వాక్రా సంఘాలను ముందుకు తీసుకువెళ్లామని, కేసీఆర్ వచ్చాక వాటిని విస్మరించి నాశనం చేశారన్నారు. 


ప్రజా ప్రభుత్వం వస్తుంది :


ప్రజా కూటమితో వచ్చేది ప్రజా ప్రభుత్వమని ప్రజా కూటమిగా అందరం కలిసి టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని రాహుల్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల గొంతుక  రేపటి ఎన్నికల్లో ప్రతిద్వనించాలని కూడా ఆయన కోరారు. ఇది నాందిగా దేశంలోనే రాజకీయ మార్పులు వస్తాయని కూడా రాహుల్ స్పష్టం చేశారు. మొత్తానికి రాహుల్ స్వరంలోనూ మార్పు కనిపిస్తోంది. ధీమా బాగా పెరిగింది. అదే సమయంలో కేసీయార్ పై మాటల బాంబులను పేలుస్తూ హుషారెత్తిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: