ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సైబరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. గురువారం ఉదయం నుండి రాత్రి వరకూ కుకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్డు  షోలకు చేయాలని ప్లాన్ చేశారు. కుకట్ పల్లిలో చుండ్రు అలియాస్ నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకడైన భవ్యా ఆనందప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో కుకట్ పల్లి నియోజకవర్గంలో మధ్యాహ్నంపైన శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో రోడ్డు షోలు చేయాలన్నది చంద్రబాబు ఆలోచన.

 

బుధవారం రాత్రి హైదరాబాద్ లో రెండు బహిరంగసభల్లో పాల్గొన్న చంద్రబాబు తన ఇంట్లోనే బసచేశారు. ఉదయానికి రోడ్డు షోలకు రెడీ అయిన చంద్రబాబుకు సైబరాబాద్ పోలీసులు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. కుకట్ పల్లి నియోజకవర్గంలో రోడ్డు షోకు అనుమతి లేదని చెప్పటంతో చంద్రబాబు ఆశ్చర్యపోయారు. ఏపి ముఖ్యమంత్రి అయిన తన రోడ్డుషోనే పోలీసులు అడ్డుకోవటంతో చంద్రబాబుకు షాక్ కొట్టినట్లైంది. ఉదయం కావూరి హిల్స్, కొత్తగూడ క్రాస్ రోడ్డు, బొటానికల్ గార్డెన్, కొండాపూర్ మీదుగా లింగంపల్లి, చందానగర్, గంగారం మీదుగా ఆల్విన్ కాలనీ జంక్షన్ వరకూ రోడ్డు షోకు రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు. మియాపూర్, హైదరానగర్, నిజాంపేట క్రాస్ రోడ్ లో సభలు కూడా రెడీ చేసుకున్నారు. రూట్ మ్యాప్ తో పాటు రోడ్డు షోకు టిడిపి 27వ తేదీన అనుమతి కోరుతు పోలీసులకు దరఖాస్తు కూడా చేసుకుంది.

 

అయితే కుకట్ పల్లిలో రోడ్డు షోకు అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు తెగేసి చెప్పారు. కారణం ఏమిటంటే, ఇదే రోజు కెటియార్ రోడ్డు షో కూడా ఉందట. ఎవరు రోడ్డుషో చేసిన పై ప్రాంతాలపైనే ప్రధానంగా దృష్టి పెడతారు. ఒకేసారి చంద్రబాబు, కెటియార్ రోడ్డుషోలు జరిగితే శాంతిభద్రతల సమస్యలు వస్తాయన్న కారణంతో సైబరాబాద్ పోలీసులు చంద్రబాబు రోడ్డుషోను అడ్డుకున్నారు. కావాలనుకుంటే మియాపూర్ ప్రాంతాల్లో రోడ్డు షో నిర్వహించుకోవచ్చంటూ చల్లగా చెప్పారు. మరి శేరిలింగపల్లి నియోజకవర్గంలో చేయాలని అనుకున్న రోడ్డు షో పై స్పష్టత లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: