తెలంగాణ ఎన్నికల్లో  ఆసక్తికరమైన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అక్కడ గెలుపుపై అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. వాటిలో గజ్వేల్, కొడంగల్ వంటి ఉన్నాయి. గజ్వేల్ లో కేసీఆర్ పోటీలో ఉంటే.. కొడంగల్ లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లోనూ  కేసీఆర్, రేవంత్ రెడ్డిల గెలుపుపై ఎవరికీ అనుమానాల్లేవు.. 


కానీ ఈ స్థానాలు గెలుచుకుని ప్రత్యర్థి పార్టీలకు షాక్ ఇవ్వాలని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యేకించి కొడంగల్ నియోజక వర్గంలో రేవంత్ రెడ్డిని ఓడించడం ద్వారా అతనికి గట్టి గుణపాఠం చెప్పాలని టీఆర్ఎస్  ప్లాన్ చేస్తోంది. ఇందుకు హరీశ్ రావు ఆధ్వర్యంలో  ప్రత్యేక మథనం కూడా జరిగింది. ఇలాంటి సమయంలో కొడంగల్ లో ఆదాయపు పన్ను శాఖ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. 


ఐతే.. సహజంగా ఇలాంటి దాడులు ప్రతిపక్ష పార్టీల నాయకులపై జరుగుతాయి. కానీ.. కొడంగల్ లో అధికార పార్టీ  అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఐటీ శాఖ దాడులు జరిపింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున  డబ్బు కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ దాడులు హాట్ టాపిక్ గా మారాయి. 


ఎన్నికల సమయంలో ఈసీ అధికారులు, పోలీసులు సోదాలు నిర్వహించడం మామూలే కానీ.. ఇక్కడ ఐటీ శాఖ దాడులు జరపడం అనేక చర్చలకు దారి తీస్తోంది. ఈ పరిణామం ఎవరికి లాభిస్తుంది.. ఎవరికి నష్టం కలిగిస్తుందన్న చర్చ జరుగుతోంది. ఐతే.. రేవంత్ రెడ్డి మాత్రం.. తనను ఓడించేందుకు  టీఆర్ఎస్  పెద్ద ఎత్తున నగదు కుమ్మరిస్తోందని.. ఆ సమాచారం వల్లే ఐటీ శాఖ దాడులు నిర్వహించి ఉంటుందని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: