ఫిరాయింపు ఎంఎల్ఏలు, స్పీకర్ చివరకు హైకోర్టును కూడా లెక్క చేయటం లేదు. ఫిరాయింపుల విషయంలో నోటీసులిస్తే కనీసం సమాధానం కూడా చెప్పలేదు. దాంతో ఫిరాయింపు ఎంఎల్ఏలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిరాయింపులపై గతంలో జారీ చేసిన నోటీసులకు ఫిరాయింపుల్లో ఎవ్వరూ సమాధానం ఇవ్వనందుకు అందరిపైనా కోర్టు మండిపడింది. ఫిరాయింపులపై అనర్హత వేటు కేసును సుప్రింకోర్టు ధర్మాసనం విచారించాల్సిన అవసరం లేదని తామే విచారిస్తామని కూడా హైకోర్టు స్పష్టం చేయటం గమనార్హం. పనిలో పనిగా ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా చర్యలు ఉంటున్నందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు కూడా నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. సరైన సమాధానం ఇవ్వటానికి అందరికీ రెండు వారాల గడువు ఇచ్చింది.

 

ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు తన భుజాన్ని తాను రోజు చరుచుకుంటున్న చంద్రబాబునాయుడు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలనుకున్నారు. అందుకనే భారీగా ఫిరాయింపులు మొదలుపెట్టారు. వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను అడ్డుగోలుగా టిడిపిలోకి లాక్కున్నారు. దాంతో వైసిపి గగ్గోలు మొదలుపెట్టింది. అయినా లెక్క చేయలేదు. కోర్టుకెక్కిని ఉపయోగం కనబడలేదు. దాంతో సుప్రింకోర్టును కూడా ఆశ్రయించింది. ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హత వేటుపై వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టులో పిటీషన్ కూడా వేశారు. వైసిపి ఏ విధంగా పోరాటాలు చేస్తున్నా చంద్రబాబు మాత్రం తన పని తాను చేసుకునిపోతూనే ఉన్నారు.

 

ఫిరాయింపులను ప్రోత్సహించటానికి చంద్రబాబు ఒక్కొక్కరిని ఒక్కోవిధంగా మ్యానేజ్ చేశారు. నలుగురికి మంత్రిపదవులిచ్చారు. కొందరికి కోట్ల రూపాయలు ముట్టచెప్పారు. మరి కొందరికి కాంట్రాక్టులు, ఇంకొందరి అప్పులు తీర్చేసి చేతిలో కొంత డబ్బు పెట్టారు మరికొందరికి డబ్బు ప్లస్ కార్పొరేషన్ పదవులిచ్చారు. ఇల ఎంత అసహ్యంగా ప్రజాస్వామ్యాన్ని దిగజార్చవచ్చో అంతా చేశారు. ఇపుడా అంశంపైనే హైకోర్టు సీరియస్ అయ్యింది. ఆరుమాసాల క్రితం ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వకపోవటంపై మండిపడింది. తాజాగా జారీ చేసిన నోటీసుల్లో రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలంటూ స్పష్టంగా ఆదేశించింది. మరి ఈ నోటీసుకన్నా ఫిరాయింపులు, స్పీకర్ స్పందిస్తారో లేదో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: