లగడపాటి రాజగోపాల్. ఆయన మాజీ ఎంపీ. రాజకీయాల్లో బాగా పాపులర్. విభజన సమయంలో పోరాడి ఓడిన వీరుడు. చివరకి రాజకీయాల నుంచి అస్ర సన్యాసం చేసినా గత కొంతకాలంగా మళ్ళీ రాజకీయ తెరపై కనిపిస్తున్నారు. తాను ఏ పార్టీకి చెందని వాడినని చెప్పుకునే రాజగోపాల్ మాట్లాడితే మాత్రం  అది సంచలన వార్తే అవుతోంది.


అక్కడ   ఇండిపెండెంట్లదే హవా:


ఇదిలా ఉండగా నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించే తెలంగాణా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న దానిపై డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం చెబుతానని అంటున్న లగడపాటి మచ్చుకు కొన్ని ముచ్చట్లు వినిపించారు. టీయారెస్, మహా కూటమి మధ్య నువ్వా నేనా అని సాగే భీకర పోరులో తక్కువలో తక్కువ పది మంది వరకూ ఇండిపెండెంట్లు గెలుస్తారని లగడపాటి వారు చెప్పడం ఇపుడు సెన్సేషనల్ అయింది.
పైగా ప్రధాన పార్టీల గుండెల్లో రైళ్ళు కూడా పరిగెత్తేలా చేసింది. ఇండిపెండెంట్లు ఇంత పెద్ద ఎత్తున గెలిస్తే రేపటి తెలంగాణాలో అధికారం ఎవరి పరం అవుతుంది. అసలు కనీస మెజారిటీ వస్తుందా. హంగు వస్తుందా అన్న డౌట్లు ఎన్నో వస్తున్నాయిపుడు.


ప్రజల నాడి అది :


తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు ప్రధాన పార్టీల అభ్యర్థుల్ని తిరస్కరిస్తారంటున్నారు లగడపాటి. పార్టీల ప్రలోభాలకు లొంగకుండా.. స్వతంత్ర అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతారని జోస్యం చెప్పారు. రాష్ట్రం మొత్తం మీద 8 నుంచి 10 మంది వరకు ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధిస్తారంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్‌పేటలో శివకుమార్ రెడ్డి.. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్‌లో అనిల్ జాదవ్ గెలవబోతున్నట్లు వారి పేర్లతో సహా చెప్పారు.
రోజుకు ఇద్దరు చొప్పున గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తానన్నారు.  మొత్తానికి తెలంగాణా ఎన్నికలపై లగడపాటి జోస్యం కనుక నిజం అయితే హంగు తప్పదని అంటున్నారు. లగడపాటి వారి జోస్యం ఎపుడూ తప్పు కాదు కాబట్టి ఇదే జరుగుతుందని కూడా అపుడే కొత్త పందేలు కూడా మొదలయ్యాయట.


మరింత సమాచారం తెలుసుకోండి: