నెల్లూరు జిల్లాలో టిక్కెట్లను చంద్రబాబునాయుడు ఫైనల్ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు ఎంపిగా మాజీ ఎంఎల్ఏ బీద మస్తాన్ రావును చంద్రబాబు ఖరారు చేశారు. ఒకవైపు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా వీలైన చోట్ల అభ్యర్ధులను ఖరారు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకనే సహజ శైలికి భిన్నంగా చంద్రబాబు కూడా ఇపుడు అభ్యర్ధులను ఫైనల్ చేసేస్తున్నారు. మామూలుగా అయితే నామినేషన్లకు ముందురోజు వరకూ టిక్కెట్లు ఫైనల్ చేసే అలవాటు చంద్రబాబుకు లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

 

నెల్లూరు జిల్లా నేతలతో జరిగిన సమీక్షలో చంద్రబాబు ముగ్గురు ఎంఎల్ఏలకు టిక్కెట్లు ఖరారు చేయటమే కాకుండా ఇద్దరు మంత్రులను కూడా రంగంలోకి దింపారు. ఉదయగిరిలో ఎంఎల్ఏ బొల్లినేని రామారావు, వెంకగిరిలో కురుగొండ్ల రామకృష్ణ, కోవూరులో పోలంరెడ్డి శ్రీనివాసులుకు లైన్ క్లియర్ అయ్యింది. అదే సమయంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిని కావాలి నుండి పోటీ చేయించాలని నిర్ణయించారు.

 

నెల్లూరు ఎంపిగా వైసిపి నుండి మేకపాటి రాజమోహన్ రెడ్డి పోటీలో ఉండటం ఖాయం. పోయిన ఎన్నికల్లో ఆదాల మేకపాటితో పోటీ పడి ఓడిపోయారు. ఈసారి ఎంఎల్ఏగా కావలి నియోజకవర్గంలో రంగంలోకి దిగుతున్నారు. అదే సమయంలో పోయిన ఎన్నికల్లో కావలి అసెంబ్లీకి పోటీ చేసిన బీద మస్తాన్ రావు పోటీ చేసి ఓడిపోయారు. రేపటి ఎన్నికల్లో మేకపాటిని నెల్లూరు ఎంపిగా ఢీకొనబోతున్నారు. మొదట్లో  ఆదాల ఎంపిగా బీద కావలి ఎంఎల్ఏగానే అనుకున్నారు. కానీ హఠాత్తుగా సమీకరణలు మారిపోవటం గమనార్హం.

 

ఇద్దరు మంత్రులను కూడా చంద్రబాబు పోటీ చేయిస్తున్నారు. నెల్లూరు సిటీ నుండి నారాయణ, సర్వేపల్లి నుండి మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీలోకి దిగుతున్నారు. నారాయణ ఎంఎల్ఏ అయి మంత్రివర్గంలోకి వచ్చారు. అలాగే సోమిరెడ్డి కూడా శాసనమండలి సభ్యుడైన తర్వాతే మంత్రయ్యారు. అంటే జిల్లాలోని ఇద్దరు మంత్రులూ ఎంఎల్సీలే కావటం గమనార్హం. నారాయణ మొదటి సారి పోటీ చేయబోతున్నారు. సోమిరెడ్డి ఇఫ్పటికి మూడు వరుస ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. కాబట్టి మంత్రులిద్దరూ వచ్చే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

 

రాజకీయంగా చూస్తే జిల్లాలో వైసిపి చాలా బలంగా కనిపిస్తోంది. పోయిన ఎన్నికల్లో జిల్లాలోని పది నియోజకవర్గాల్లో వైసిపి ఏడు చోట్ల గెలిచింది. తర్వాత ఓ ఎంఎల్ఏ టిడిపిలోకి ఫిరాయించారనుకోండి. జగన్ పాదయాత్ర సందర్భంగా వైసిపి మరింత బలోపేతమైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆర్దికంగా గట్టి స్ధితిలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలో చేరారు. తర్వాత రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. అదే సమయంలో టిడిపి నుండి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి కొడుకు రామ్ కుమార్ రెడ్డి బిజెపి నుండి వైసిపిలో చేరారు. సూళ్ళూరుపేట మున్సిపాలిటి ఫ్లోర్ లీడర్ వేనాటి సుమంత్ లాంటి వాళ్ళు చాలామంది వైసిపిలో చేరటంతో అప్పటికన్నా ఇపుడు మరింత బలంగా కనిపిస్తోంది.

 

మంత్రులిద్దరూ పోటీలోకి దిగటమంటే పెద్ద అగ్నిపరీక్షను ఎదుర్కోవటమనే చెప్పాలి. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పోటీకి దిగుతున్న మంత్రి నారాయణ  వైసిపి ఎంఎల్ఏ అనీల్ కుమార్ యాదవ్ ను ఢీ కొనాలి. అనీల్ కు నియోజకవర్గంలో మంచి పట్టుంది. యువకుడు, డేరింగ్ గా దూసుకుపోయే యువనేతగా పేరు సంపాదించుకున్నారు. కాబట్టి అనీల్ ను ఎదుర్కోవటం మంత్రికి అంత సులభం కాదు. అదే సమయంలో సోమిరెడ్డి వైసిపి ఎంఎల్ఏ మేకపాటి గౌతమ్ రెడ్డిని ఎదుర్కోవాలి. మరి మంత్రి ఏ మేరకు గౌతమ్ ను తట్టుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: