తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో కంచుకోటగా నిలిచిన రాయలసీమలోని అనంతపురం జిల్లా టీడీపీలో వచ్చే ఎన్నికల వేళ‌ అనుహ్య పరిణామాలు తప్పేలా లేవు. సీఎం చంద్రబాబు జిల్లాలో న‌లుగురైదుగురు సిట్టింగ్‌ల‌ను  నిర్దాక్షిణ్యంగా మారుస్తారన్న చర్చలు అప్పుడే స్టార్ట్‌ అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఏపీ మొత్తం మీద 40 నుంచి 45 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను తప్పించి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తారన్న టాక్‌ ఇప్పటికే బయటకు వచ్చింది. ప్రతి జిల్లాల్లోనూ పని తీరు దారుణంగా ఉన్న వారిని పక్కన పెట్టేస్తారన్న టాక్‌ ఉండగా ఈ క్రమంలోనే ఆయా జిల్లాల్లో త‌ప్పించే ఎమ్మెల్యేల పేర్ల‌తో ఓ లిస్ట్ కూడా ప్ర‌చారంలో ఉంది. వీరిలో కొంత మందికి చివరిలో సమీకరణలు ఎలా మారి సీటు ద‌క్కినా... చాలా మందిని మాత్రం పక్కన పెట్టడం అయితే షురూ. 


అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 14 అసెంబ్లీ సీట్లకు 12 సీట్లలో విజయం సాధించింది. అనంతపురం, హిందూపురం ఎంపీ సీట్లలోనూ టీడీపీ ఘన విజయం సాధించింది. ఉరవకొండ, కదిరి సీట్లను మాత్రమే టీడీపీ స్వల్ప తేడాతో కోల్పోయింది. ఆపరేషన్‌ ఆకర్ష్‌ నేపథ్యంలో కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌ బాషా సైకిల్‌ ఎక్కేశారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో జిల్లాల్లో ఐదు నుంచి ఆరు సీట్లలో అభ్యర్థులను మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. చంద్రబాబు తాజాగా జిల్లాల్లో జరిపిన రెండు రోజుల పర్యటనలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చినట్టే జిల్లా టీడీపీ వర్గాల్లో  గుసగుసలు మొదలయ్యాయి. ప్రత్యేకంగా శింగనమల, కళ్యాణదుర్గం, కదిరి ఈ మూడు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ల‌ను గ్యారెంటీగా మార్చేయనున్నారు. అలాగే గుంతకల్లు, పుట్టపర్తి, అనంతపురం, క‌ళ్యాణ‌దుర్గం లాంటి చోట్ల‌ అక్కడ ఉన్న పార్టీలో అంతర్గత విభేదాలు, సామాజిక సమీకరణల నేపథ్యంలో ఏమన్నా మార్పులు, చేర్పులు ఉంటాయా ? అన్నది చూడాల్సి ఉంది. 


ఇదిలా ఉంటే ప్రత్యేకంగా శింగనమల, కళ్యాణదుర్గం, గుంతకల్లు, కదిరి, పుట్టపర్తి ఈ ఐదు నియోజకవర్గాల్లో సీఎం సమీక్షకు ఒక రోజు ముందు ఫోర్‌మెన్‌ కమిటీ కూడా ఈ ఐదు నియోజకవర్గాల్లో సమన్వయ కమిటి సభ్యులు, ఎంపీటీసీలు, జట్పీటీసీలు, కౌన్సెలర్లు అందరితోనూ విడివిడిగా మాట్లాడి ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందని ఆరా తీసింది. పైన చెప్పిన ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పని తీరుపై అన్ని శ్రేణుల నాయకుల నుంచి తీవ్రమైన వ్యతిరేఖత ఉన్నట్టు నివేదికలు బాబుకు అందినట్టు తెలుస్తోంది. ఈ ఐదు నియోజకవర్గానికి చెందిన నాయకులు చంద్రబాబు ఎదుట సైతం ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేఖతతో మాట్లాడడం బట్టి చూస్తే ఈ ఐదు నియోజకవర్గాల్లో ఎక్కువగా మార్పులు, చేర్పులకు ఛాన్సులు కనిపిస్తున్నాయి. 


అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ, చంద్రబాబు ఒక్కటి అవుతున్న వేళ‌ ఏపీలోనూ ఈ రెండు పార్టీల మధ్య‌ పొత్తు కుదరవచ్చు. ఈ రెండు పార్టీల‌ పొత్తు కుదిరితే జిల్లాల్లో కళ్యాణదుర్గం, శింగనమల నియోజకవర్గాలను కాంగ్రెస్‌ కోరే అవకాశాలు ఉన్నాయి. శింగనమల నుంచి మాజీ మంత్రి శైలజానాథ్‌, కళ్యాణదుర్గం నుంచి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి బరిలోకి దిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇక కదిరిలో అత్తార్‌ చాంద్‌ బాషా అట్టర్‌ఫ్లాప్‌ అవ్వడంతో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న కందికుంట వెంకటప్రసాద్‌నే రంగంలోకి దించడం ఖ‌రారు అయినట్టే అని తెలుస్తోంది. ఏదేమైనా చంద్రబాబు పని తీరు బాగోపోతే మిగిలిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేల విషయంలో సైతం తాను ఉపేక్షించేది లేదని వార్నింగులు ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: