తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాజా మాజీ సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గ పోరు తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా రెండు తెలుగురాష్ట్రల్లో సగటు రాజకీయ అభిమానుల దృష్టిని ఆకర్శిస్తోంది. తాజా మాజీ సీఎంగా ఉన్న కేసీఆర్‌ ఇక్కడ నుంచి బరిలో నిలవగా కాంగ్రెస్‌ తరపున వంటేరు ప్రతాప్‌ రెడ్డి రంగంలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ వంటేరు ఇక్కడ పోటీ చేస్తు ఓడిపోతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన కేసీఆర్‌కు గట్టి పోటీ ఇచ్చినట్టే భావించాలి. సీఎం అభ్యర్థిగా ఉన్న కేసీఆర్‌పై వంటేరు 19,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతేకాకుండా గజ్వేల్‌ నియోజకవర్గంలో సైతం గజ్వేల్‌ మున్సిపాలిటీతో పాటు ఆ నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. నియోజకవర్గంలో కొన్ని ఏళ్లుగా పార్టీలకు అతీతంగా ప్రజల్లోకి చొచ్చుకుపోవడం ఆయనకు కలిసిరానుంది. 

Image result for telangana

గత ఎన్నికల్లో ప్రతాప్‌ రెడ్డి రెండో స్థానంలో నిలవగా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే టి. నర్సిరెడ్డి 33,000 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రతాప్‌ రెడ్డి కాంగ్రెస్‌లోకి జంప్‌ చేసేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ టీడీపీ పొత్తుగా ఉండడం, ఈ నియోజకవర్గంలో సీపీఐకి సైతం కాస్తో కూస్తో ఓటు బ్యాంకు ఉండడం, తెలంగాణ జనసమితి కూడా ప్రతాప్‌ రెడ్డికి సపోర్ట్‌ చేస్తుండడంతో గజ్వేల్లో హోరా హోరీ పోరు తప్పేలా లేదు. గత ఎన్నికల్లో ప్రతాప్‌ రెడ్డి కేవలం 19,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదే టైమ్‌లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన నర్సిరెడ్డి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేసి ఇప్పుడు తిరిగి కాంగ్రెస్‌ గూటికే చేరారు. టీడీపీ, కాంగ్రెస్‌ ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగితే ఈ హోరా హోరీ పోరులో కేసీఆర్‌కు ముచ్చెమటలు ఖాయం. వాస్తవంగా ప్రస్తుతం గజ్వేల్లో ఉన్న పరిస్థితి చూస్తుంటే కేసీఆర్‌ గెలుపు మరీ అంత నల్లేరు మీద నడక కాదని చెబుతున్నారు. 

Image result for telangana elections

కేసీఆర్‌కు గెలుపు కష్టమేనని... ఒకవేళ‌ గెలిచినా అత్తెసరు మెజారిటీతోనే ఆయన బయట పడవచ్చని కూడా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో కేసీఆర్‌ నాలుగున్నర సంవత్సరాల్లో గజ్వేల్‌ను కోట్లాది రూపాయిలతో అభివృద్ధి చేస్తున్నానని చెబుతున్నా ఇప్పుడు గెలుపు కోసం ఆయన ఆపసోపాలు పడుతున్నట్టు తెలుస్తోంది. అక్కడ ప్రతాప్‌ రెడ్డిని నియంత్రించేందుకు అధికార యంత్రంగాన్ని ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారన్న విమర్శలుకూడా వస్తున్నాయి. చివరకు పోలీసులు త‌న‌ను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్ర‌తాప‌రెడ్డి తనను చంపేస్తారని ఆమరణ దీక్షకు సైతం దిగిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు గమనిస్తున్న రాజకీయ మేధావులు గజ్వేల్లో  ప్రి పోలింగ్ జరిగితే... అధికార యంత్రాంగం కేసీఆర్‌కు సపోర్ట్‌ చెయ్యకపోతే ప్రతాప్‌ రెడ్డి గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. 


ఇక ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే కేసీఆర్‌ గజ్వేల్‌ను హరీష్‌కు అప్పగించారు. తాను ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రమంతటా తిరగాల్సి ఉన్న నేపథ్యంలో గజ్వేల్లో గులాబి జెండా ఎగరవేసే బాధ్యతను హరిష్‌కు అప్పగించారు. ఈ క్రమంలోనే హరీష్‌ స్థానిక నేతలతో సమావేశం అవుతూ నియోజకవర్గంలో ముఖ్య నేతలను కూడకట్టి అస‌మ్మ‌తి పెరగకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కేసీఆర్‌ కోట్లాది రూపాయిలతో గజ్వేల్‌ను అభివృద్ధి చేసామని చెబుతున్నా ఆయన సొంత ఫామ్‌ హౌస్‌ ఉన్న ఎర్రవెల్లి సమీప ప్రాంతాలకు మాత్రమే అభివృద్ధి పరిమితం అయ్యిందని నియోజకవర్గంలో పేద, మధ్య తరగతి వర్గాలకు ఆయన సీఎంగా ఉన్నా ఒరిగిందేమి లేదన్న అభిప్రాయం కూడా సాధారణ జనాల్లో వ్యక్తం అవుతోంది. ప్రతాప్‌ రెడ్డి సైతం తనకు వస్తున్న బెదిరింపు ఫోన్లు గురించి చెబుతూ తనకు అధికార యంత్రాంగం సపోర్ట్‌ చెయ్యడం లేదని వాపోతున్నారు.


అమరావతి నుంచి డబ్బులు తీసుకువస్తూ ఇక్కడ కేసీఆర్‌పైనే పోటీకి దిగుతావా ? అంటూ కొంత మంది అధికారులు సైతం తనను బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. తన ఇంట్లో డబ్బు, మధ్యం లేకపోయినా పదే పదే ఆరోపణల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని.... అదే టీఆర్‌ఎస్‌ నాయకుల ఇంట్లో కోట్లాది రూపాయిలు డబ్బులు దాచినా అసలు అధికారులు అటు వైపే చూడడం లేదని ఆయన విమర్శించారు. పత్రికల్లో సైతం గజ్వేల్లో కేసీఆర్‌కు వంటేరు ప్రతాప్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నిక‌ జరిగితే కేసీఆర్‌ ఓడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నాయి. దీనిని బట్టీ గజ్వేల్లో కేసీఆర్‌ వర్సెస్‌ వంటేరు మధ్య‌ ఎంత టఫ్‌ ఫైట్‌ నడుస్తుందో అర్థం అవుతోంది. ఒకవేళ‌ కేసీఆర్‌ గెలిచినా ఆయన మెజారిటీ మాత్రం సీఎం స్థాయిలో ఉండదని కూడా రాజకీయ వర్గాల అంచనా. మరి ఫైన‌ల్‌గా ఏం జరుగుతుందో ? డిసెంబర్‌ 11న జరిగే కౌంటింగ్‌లో తేలిపోనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: