మరో ఆరు రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు స్వతంత్రులు చుక్కులు చూసిస్తున్నారు. అవటానికి ఇండిపెండెంట్ అభ్యర్ధులే అయినా మొన్నటి వరకూ వీరు కూడా ఏదో ఒక పార్టీలో కీలకంగా ఉన్న వారే. కాకపోతే వాళ్ళకు పార్టీల టిక్కెట్లు దక్కని కారణంగా ఇండిపెండెంట్ గానో లేకపోతే బిఎల్ఎఫ్ అభ్యర్ధులుగానో నామినేషన్లు వేశారు. మొదట్లో ఇండిపెండెంట్లే కదా అని వీళ్ళను పార్టీల అభ్యర్ధులు చాలా లైట్ తీసుకున్నారు. దాంతో వాళ్ళు ఇపుడు ఏకు మేకై కూర్చున్నారు. ప్రచారంలో కానీ ఇతరత్రా పెద్ద పార్టీలకే చుక్కులు చూపిస్తున్నారు.


దానికి తోడు ఆంధ్రా ఆక్టోపస్ గా పాపులరైన మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ కూడా రాబోయే ఎన్నికల్లో 10 మంది ఇండిపెండెట్లు గెలవబోతున్నట్లు జోస్యం చెప్పటంతో మిగిలిన వాళ్ళకు చెమటలు పడుతున్నాయి. 119 నియోజకవర్గాల్లో 10 మంది స్వతంత్ర అభ్యర్ధులు గెలవటమంటే మామూలు విషయం కాదు. లగడపాటి జోస్యంపై అందరు ఎందుకంత చర్చించుకుంటున్నారు ? ఎందుకంటే, లగడపాటి చేయించే సర్వేలపై ఎక్కువ విశ్వసనీయతుంది. అందుకనే ఇఫుడు లగడపాటి జోస్యంపై పార్టీల్లో గుబులు కూడా మొదలైంది.


ఇండిపెండెంట్లుగా వేసిన అభ్యర్ధులపై టిఆర్ఎస్, కాంగ్రెస్, టిడిపి, టిజెఎస్ లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఇండిపెండెంట్ల ప్రత్యేకత ఏమిటంటే, ఒకటి వాళ్ళన్నా గెలవగలరు లేకపోతే ప్రధాన పార్టీల అభ్యర్ధుల గెలుపోటముల్లో కీలక పాత్ర పోషించగలరు. ఇబ్రహింపట్నం నియోజకవర్గంలో మాజీ ఎంఎల్ఏ మల్ రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ టిక్కెట్టును ఆశ్రయించారు. కానీ పొత్తుల్లో ఆ నియోజకవర్గం టిడిపికెళ్ళింది. దాంతో మల్ రెడ్డి  బిఎస్పీ  టిక్కెట్టుపై పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేసిన టిడిపి అభ్యర్ధి సామా రంగారెడ్డి పోటీలో నుండి తప్పుకోవటంతో మహాకూటమి మొత్తం మల్ రెడ్డికే మద్దతుగా నిలబడింది.


దాంతో టిఆర్ఎస్ అభ్యర్ధికి చెమటలు పడుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో జలంధర్ రెడ్డి టిక్కెట్టు ఆశించారు. కానీ సిట్టింగ్ ఎంఎల్ఏ చిట్టెం రామ్మోహన్ రెడ్డికే టిక్కెట్టు దక్కింది. దాంతో జలంధర్ పోటీలో ఉండటంతో ఆ ప్రభావం చిట్టెంపై పడుతోంది. మేడ్చెల్ నియోజకవర్గంలో నక్కా ప్రభాకర్ గౌడ్ టిఆర్ఎస్ టిక్కెట్టు ఆశించారు. కానీ టిక్కెట్టేమో మల్లారెడ్డికి దక్కింది. కాంగ్రెస్ నుండి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు. నక్కా వల్ల మల్లారెడ్డి చాలా ఇబ్బందులు పడుతున్నారు.


ఇక మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట, రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్, వికారాబాద్, మల్కాజ్ గిరి తో పాటు మరికొన్ని  నియోజకవర్గాల్లో కూడా ఇండిపెండెట్లదే హవా కనిపిస్తోంది. ఇక్కడే లగడపాటి జోస్యంపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే గెలవబోయే 10 మంది ఇండిపెండంట్లలో రెండు పేర్లను బయటపెట్టారు. మరి మిగిలిన ఎనిమిది మందెవరనే విషయంలో అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది. మరి ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాల్సిందే.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: