ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఎంపిగా  లగడపాటి రాజగోపాల్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నికలొచ్చాయంటే.. లగడపాటి సర్వే వివరాల కోసం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఉత్కంఠగా మారిన ఎన్నికలపై లగడపాటి  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. తన అభిప్రాయాన్ని వెల్లడించారు.  తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు ప్రధాన పార్టీల అభ్యర్థుల్ని తిరస్కరిస్తారంటున్నారు లగడపాటి. పార్టీల ప్రలోభాలకు లొంగకుండా.. స్వతంత్ర అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతారని జోస్యం చెప్పారు.

రాష్ట్రం మొత్తం మీద 8 నుంచి 10 మంది వరకు ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధిస్తారంటున్నారు. అంతే కాదు రోజుకు ఇద్దరు చొప్పున గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తానన్నారు.  ఇదిలా ఉంటే తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో పది మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుస్తారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఈరోజు ఫిర్యాదు చేసింది.  టీఆర్‌ఎస్‌ ఎన్నికల సమన్వయ కమిటీ తరఫున దండె విఠల్‌ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేశారు.

తిరుపతిలో లగడపాటి చేసిన ప్రకటనను టీవీల్లో ప్రసారం చేశారని.. ఇలాంటి ప్రకటన ఈ సమయంలో సరైంది కాదన్నారు. రోజుకు ఇద్దరు ఇండిపెండెంట్లకు సంబంధించిన ఫలితాలను వెల్లడిస్తానని లగడపాటి పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో స్వతంత్రుల హవా ఎక్కువగా ఉందని లగడపాటి సర్వే నివేదిక బయటపెట్టడం మహాకూటమి కుట్రలో భాగమన్నారు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌. పాక్షికంగా లగడపాటి వెల్లడించిన అంశాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. లగడపాటి ప్రకటన ఓటర్లను గందరగోళ పర్చే విధంగా ఉందన్నారు బూర నర్సయ్యగౌడ్.



మరింత సమాచారం తెలుసుకోండి: