తెలంగాణా ఇపుడు రాజకీయ రణ క్షేత్రం. సకల వ్యూహలకు పదును పెట్టి అస్ర శస్రాలను ప్రయోగించే కురు క్షేత్రం. అక్కడ బయటకు కనిపిస్తున్న ముఖాలు, వేరు అంతర్ముఖాలు వేరు. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో అలనాటి భారత  యుధ్ధాన్ని తలపిస్తోంది తెలంగాణా పోరు. ఎవరు విజేత, ఎవరు పరాజితులన్నది  ఇప్పటికి తేలకున్నా భీకర సమరం మాత్రం సాగిపోతోంది.


ఇద్దరు చంద్రుల యుధ్ధం :


నిజానికి తెలంగాణాలో ఎన్నికల పోరాటం బయటకు కనిపించేది టీయారెస్ మహా కూటమి మధ్యన అనుకుంటారు. కానీ వెనక మాత్రం చాలా కధ ఉంది. తెలంగాణా చంద్రుడు చంద్రశేఖరరావు, ఆంధ్ర చంద్రుడు బాబుకు మధ్యన జరిగే పోరుగా దీన్ని అంతా భావిస్తున్నారు. నిజానికి బాబు తలచుకోకపోతే మహా కూటమి లేనే లేదు. కాంగ్రెస్ కు అన్ని రకాల వనరులు సమకూరేవి కానే కావు. ఇక వ్యూహాల్లో సైతం కాంగ్రెస్ ఇంతలా ముందంజలో వుండే అవకాశాలు లేవంటే లేవు. మొత్తం వ్యవహారాన్ని క్రిష్ణుడిలా చంద్రబాబు చక్కబెడుతున్నారు.


అన్ని శక్తులూ కూడగట్టి :


చంద్రబాబు ఉమ్మడి ఏపీకి తొమ్మిదేళ్ళ పాటు సీఎం. అందువల్ల ఆయనకు అక్కడ తెలియనిది లేదు. పరిచయాలకు కొదవ లేదు. ఏ పుట్టలో ఏ పాము ఉందో కూడా బాబుకే బాగా తెలుసు. అందుకే చంద్రబాబు ఇపుడు తన అక్కర కోసం అన్నీ బయటకు తీస్తున్నారు. వాడుకుంటున్నారు. దాంతోనే తెలంగాణా ఎన్నికల పోరు కొత్త మలుపులు  తిరుగుతోంది. నిజానికి చాలా ప్రశాంతంగా జరగాల్సిన తెలంగాణా పోరు ఇపుడు  బాగా హీటెక్కుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునెలా పరిస్థితి మారుతోంది. ఈ పరిణామాలు చూస్తూంటే తెలంగాణాలో పోరు రెండు పార్టీల మధ్య కానే కాదు అనిపిస్తోంది.


ఆ ఇద్దరే :


ముందే చెప్పుకున్నట్లుగా ఇద్దరు చంద్రుల మధ్యన యుధ్ధం ఇది. ఇందులో విజేత ఎవరు అన్న దాని బట్టే రేపటి రాజకీయాలు ఆధారపడిఉంటాయి. కేసీయార్ సైతం చిన్న వారు కాదు, అద్భుతమైన వ్యూహకర్త. బాబు కూడా అలాంటి వారే. వారిద్దరి ఎత్తుగడలౌ, పై ఎత్తుల మధ్యన ఇపుదు తెలంగాణా సమరం సాగుతోంది. ఓ విధంగా ఈ ఇద్దరు చంద్రుల మేధస్సుకు, వ్యూహాలకు సిసలైన పరీక్షగా తెలంగాణా రంగస్థలం నిలిచి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: