ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం ఆంధ్రప్రదేశ్ లో కొత్త వ్యూహాలకు తెర లేస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీ అయితే బీజేపీతో విడాకులు తీసుకున్నాక మళ్ళీ వారిని దువ్వడం మొదలెట్టింది. విపక్ష వైసీపీ విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి ఆ ఓటు బ్యాంకుని దాదాపుగా కొల్లగొట్టింది. మెజారిటీ ముస్లిం లు గత ఎన్నికల్లో  వైసీపీ వెంటే ఉన్నారు. ఏపీలో మ‌రో నాలుగైదు నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిముల ఓటు ఎటు వైపు అన్న చర్చ ఇపుడు గట్టిగానే జరుగుతోంది.


అనూహ్య మద్దతు :


రెండు తెలుగు రాష్ట్రాలలో ముస్లింలను ఏక త్రాటిపైన ఉంచి వారి కోసం ఓ పార్టీని ప్రత్యేకంగా నడుపుతున్న ఘనత మజ్లిస్ పార్టీదే. దశాబ్దాల కాలంగా పాతబస్తీలో గట్టి పునాదులతో మజ్లీస్ బలంగా ఉంది. దేశంలో కూడా పలు చోట్ల తన ఉనికిని చాటుకోవడానికి మజ్లిస్ చూస్తోంది. ఇక తెలంగాణాలో టీయారెస్ కి మద్దతుగా నిలిచిన మజ్లిస్ ఏపీ విషయానికి వచ్చేసరికి వైసీపీ వైపుగా ఉంది. ఆ పార్టీకి గట్టి మద్దతు ఇస్తోంది. ఓ విధంగా ఇది టీడీపీకి ఇబ్బంది పెట్టే పరిణామమే.


సీమలో బలంగా :


సీమలో కర్నూల్ జిల్లాలో ముస్లిం మైనారిటీ వర్గాలు బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో వారంతా వైసీపీకి ఓటు వేశారు. ఈ కారణంగానే చంద్రబాబు తన మంత్రివర్గంలో ఏరి కోరి ఇదే జిల్లా నుంచి ఫరూక్ ని తీసుకొచ్చి మంత్రిని చేశారు. ఈ నేపధ్యంలో ముస్లింలకు ఐకాన్ గా ఉన్న మజ్లిస్ పార్టీ ఏపీలో జగన్ గెలుస్తాడని చెప్పడం నిజంగా టీడీపీకి షాకింగ్ న్యూసే. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇది టీడీపీకి మింగుడుపడని అంశమైతే ఏపీలో ముస్లిం సోదరులకు అసద్  ఇఛ్చిన  ఓ సంకేతంగా భావిస్తున్నారు.


ఆ ఓట్లు ఇటేనా :


మజ్లిస్ వంటి బలమైన పార్టీ అదినేత తమ ఓటు వైసీపీకే అని క్లారిటీగా చెప్పాక ఏపీ ముస్లిం సోదరులు కూడా అటు వైపుగానే ఆలోచన చేస్తారు. ఇప్పటికే ఏపీలో ముస్లిం మైనారిటీలు వైసీపీ వెంట ఉన్నారు. ఇపుడు అసద్ వ్యాఖ్యలతో మరింతగా సంఘటితమై జగన్ పార్టీ చుట్టూ ర్యాలీ అవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో ఏపీలోనూ అసదుద్దీన్ పర్యటించి వైసీపీకి అనుకూలంగా మైనారిటీ సోదరులను కదిలించే అవకాశాలు కొట్టిపారేయలేం. తెలంగాణా ఎన్నికలు కాదు కానీ జగన్ కు కొత్త మిత్రున్ని ఏపీలో ఇచ్చినట్లుగా  భావించాలి. రేపటి ఎన్నికల్లో వైసీపీ గెలిచేందుకు  ఇది నైతిక బలమనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: