పవన్ కళ్యాణ్ సభ పెడితే చాలు ఆవేశంతో ఘాటు ప్రసంగాలు చేస్తున్నారు. ఆయన ఉపన్యాస శైలి చాలా ఉద్రేకంగా ఉంటుంది. ప్రత్యర్ధులను చీల్చి చెండాడుతూ మాటల బాంబులే పేలుస్తున్నారు. గత కొంత కాలంగా పవన్ జనాల్లో ఉంటూ మీటింగులు పెడుతున్నారు. ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటనలు ముగించిన పవన్ ఇపుడు సీమ బాట పట్టారు. అనంతపురంలో  ఆయన నిర్వహించిన కవాతులో అటు టీడీపీని, ఇటు వైసీపీని కూడా వదలకుండా పదునైన బాణాలే వేశారు.


జగన్ కి జైలు తప్పదు:


ఇది పవన్ కళ్యాణ్ తీర్పు. జగన్ కేసులు గత కొన్నేళ్ళుగా కోర్టుల్లో ఉన్నాయి. అవి ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. అయితె పవన్ మాత్రం తీర్పులు చెప్పేస్తున్నారు. జగన్ కి ఎప్పటికైనా జైలు తప్పదని, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ లా ఆయన జైలుకు పోతారని తీర్పు చెప్పేశారు. అనంతపురంలో నిర్వహించిన కవాతు సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు  చేశారు. జగన్ ఏపీకి ప్రతిపక్షంగా ఏమీ చేయలేదని ముద్దులు పెట్టుకుంటూ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బాబుని నిలదీయడం జగన్ వల్ల కావడంలేదని కూడా అన్నారు.


బాబుకు వయసైపోయింది :


ఇక చంద్రబాబుకు వయసు అయిపోయిందని పవన్ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన ఇక ఏపీకి ఏమి పాలన ఇస్తారని, 2050 విజన్ అంటున్న చంద్రబాబు అప్పటికి తన  పరిస్థితులు ఊహించారా అని నిలదీశారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని లోకేష్ పంచాయతీ మంత్రిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కియా మోటార్స్ తెచ్చి అనంతపురానికి ఏదో చేసేశామని చెప్పడం దారుణమని పవన్ అన్నారు. మరిన్ని పరిశ్రమలు రావాలంటే జనసేన అధికారంలోకి రావాలని పవన్ కోరుతున్నారు. తాము పవర్లోకి వస్తే విదేశాలన్ నుంచి పారిశ్రామికవేత్తలు ఏపీకి పరుగున వస్తారని, వారి  నుంచి తాము లంచాలు కూడా కోరమని టీడీపీపై పంచులు వేశారు.


సీమ..జనసేన అడ్డా:


తాను సీమలో పుట్టకపోయినా ఈ ప్రాంతం కష్టాలు తెలుసని, మంచి కల్చర్ ఇక్కడ ఉందని పవన్ చెప్పుకొచ్చరు. ఇక్కడ జొన్న సంకటి తిన్న వాడినేనని, తరిమెళ్ళ నాగిరెడ్డి ఏకలవ్య శిష్యున్ని తాను అంటూ పవన్ చెప్పుకున్నారు. తాను సీమను అభివ్రుధ్ధి చేస్తానని, ఊరికి పది మంది యువత ముందుకు వచ్చి పోరాడితే సీమ స్వరూపమే మారుతుందని పవన్ అన్నారు. సీమ గురించి చంద్రబాబు, జగన్ ఇద్దరూ పట్టించుకోవడంలేదని పవన్ విమర్శలు గుప్పించారు. మొత్తానికి రాయలసీమలో పవన్ షో బాగానే సాగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: