విశాఖ వివాదాలకు దూరంగా ఉండే ప్రశాంత నగరం. ఇక్కడ అన్ని ప్రాంతాలు, భాషలకు చెందిన ప్రజలు నివసిస్తూంటారు. ఇక్కడ ఒక వర్గం, కులం అన్న భేద భావం మచ్చుకైనా కనిపించదు. అందువల్లనే విశాఖలో ఇతర జిల్లాల నుంచి నాయకులు వచ్చి రాజకీయ పెత్తనం చేస్తూంటారు. అటువంటి విశాఖలో ఇపుడు ప్రముఖుల పేరిట హటాత్తుగా ఏర్పాటు చేసిన  విగ్రహాల రాజకీయం పెద్ద దుమారమే రేపుతోంది.


ఆ ముగ్గురి విగ్రహాలు :


విశాఖలో తాజాగా ముగ్గురు ప్రముఖుల విగ్రహాలు బీచ్ ప్రాంతలో గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాటు చేశారు. తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు, మేటి దర్శకుడు దాసరి నారాయణరావు, నటుడు నందమూరి హరిక్రిష్ణ విగ్రహాలను  రాత్రికి రాత్రే రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. నిజానికి అక్కినేని, దాసరి విగ్రహాలు విశాఖలో ఏర్పాటు చేయాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. అయితే ఎవరూ ఊహించవి విధంగా మీడియాకు సైతం షాక్ ఇచ్చేలా హటాత్తుగా ఈ విగ్రహాల ఆవిషకరణ జరిగిపోయింది.


రాజకీయమేనా :


ఈ విగ్రహాల ఏర్పాటు వెనక రాజకీయం ఉందని అంటున్నారు. అక్కినేని, దాసరి సినీ లోకానికి చేసిన సేవలకు విగ్రహాలు ఏర్పాటు చేసినా నందమూరి హరిక్రిష్ణ విగ్రహం ఏ అర్హత చూసి పెట్టారని ప్రజల నుంచి, ఇతర రాజకీయ పక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హరిక్రిష్ణ సినీ రంగంలో ప్రతిభావంతమైన పాత్ర పోషించలేదని, రాజకీయాల్లోనూ ఆయన పాత్ర పరిమితంగానే ఉందని అంటున్నారు. ఇక ఆయనకూ విశాఖకు పెద్దగా సంబంధం కూడా లేదని, అటువంటిది ఆయన విగ్రహం విశాఖలో పెట్టాల్సిన అవసరం ఎమొచ్చిందని అంటున్నారు. అంతగా ఆయన పట్ల ప్రేమ అభిమానం ఉంటే టీడీపీ ఆఫీసులో పెట్టుకోవచ్చుకదా అని నిలదీస్తున్నారు.


మతలబు ఉందా :


ఈ విగ్రహాల స్థాపన వెనక రాజకీయ మతలబు ఉందని కూడా అంటున్నారు. హరిక్రిష్ణ దుర్మరణం పాలు కావడం పట్ల సానుభూతి ఉంది. ఇక ఆయన రాజకీయ పరాజితిడన్న బాధ కూడ జనంలో ఉంది. పైగా అన్న గారి కుమారుడు. దాంతో ఇపుడు సమయం చూసి ఆయన విగ్రహాన్ని పెట్టడం వెనక ఆయన పేరు మీద రాజకీయం చేయాలన్న ఆలొచన కనిపిస్తోందని అంటున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే విగ్రహాల ఏర్పాటుకు విధి విధానలు ఉన్నాయి. వాటిని తోసిరాజని రాత్రికి రాత్రి విగ్రహాలు  ఏర్పాటు చేయడాన్ని ఆక్షేపిస్తున్నారు. పద్ధతిగా విగ్రహాలు పెడితే అభిమానులు, జనం కూడా తరలివచ్చి ఆ వేడుక చూసే వారు కదా అని అంటున్నారు. అనుమతి లేకుండా విగ్రహాలు పెట్టడంతో విశాఖ కార్పోరేషన్ కన్నెర్ర చేస్తోంది. దీంతో తెలుగు వారికి గర్వకారణం అయిన అక్కినేని, దాసరి వంటి వారికి కూడా తీరని అవమానం జరిగిందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: