తొందరలో తెలుగుదేశంపార్టీలో నుండి మరో బిగ్ వికెట్ డౌన్ అయ్యే అవకాశం కనపిస్తోంది. మొన్ననే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు టిడిపికి రాజీనామా చేసి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే దారిలో గుంటూరు వెస్ట్ ఎంఎల్ఏ మోదుగుల వేణుగోపాలరెడ్డి కూడా ఈనెలలోనే రాజీనామా చేయటానికి రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం. మోదుగులకు కూడా చాలా కాలంగా చంద్రబాబునాయుడుతో సరైన సంబంధాలు లేవు. పార్టీ విధానాలపైన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపైన బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పైగా అందరిముందు అధికారులను నిలదీస్తున్నారు. దాంతో మోదుగుల వైఖరిపై ఇటు పార్టీలోను అటు ప్రభుత్వంలోను చర్చ జరుగుతోంది.

 

పోయిన ఎన్నికల్లో నరసరావుపేట ఎంపిగా ఉన్న మోదుగులను చంద్రబాబు బలవంతంగా ఎంఎల్ఏగా పోటీ చేయించారు. అధికారంలోకి వస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటానని హామీ ఇస్తేనే తాను ఎంఎల్ఏగా పోటీ చేసినట్లు మోదుగుల తన సన్నిహితులతో చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. కానీ టిడిపి అధికారంలోకి వచ్చినా చంద్రబాబు మాత్రం మోదుగులను పక్కనపెట్టేశారు. దాంతో ఎంఎల్ఏలో అసంతృప్తి మొదలై పెరిగిపోయింది. మోదుగుల వైఖరి వల్ల ఇబ్బంది పడుతున్న టిడిపి నేతలెవరూ సన్నిహితంగా మెలగటం లేదు. దాంతో ఎంఎల్ఏతో పార్టీ నేతలకు మధ్య గ్యాప్ వచ్చేసింది.

 

ఇటువంటి నేపధ్యంలోనే మోదుగుల మళ్ళీ నరసరావుపేట ఎంపిపై కన్నేశారు. అయితే టిక్కెట్టు కుదరదని చంద్రబాబు చెప్పేశారట. అదే సమయంలో ప్రభుత్వంపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా పెరిగిపోయింది. దాంతో అటు ఎంపిగా కానీ ఇటు ఎంఎల్ఏగా కానీ పోటీ చేసినా ఉపయోగం ఉండదని ఎంఎల్ఏ అంచనా వేశారట. దానికితోడు తన వైఖరి వల్ల వచ్చే ఎన్నికల్లో అసలు చంద్రబాబు టిక్కెట్టు ఇస్తారా అని కూడా అనుమానం మొదలైందట. కాబట్టి ఈ పరిస్ధితుల్లో టిడిపిలో అభద్రతతో కొనసాగటం వల్ల ఉపయోగం లేదనుకున్నారు. అందుకనే వైసిపిలోకి మారిపోయేందుక నిర్ణయించారట.

 

అదే సమయంలో మోదుగులలోని అసంతృప్తిని  గ్రహించిన స్ధానిక నేతలు విషయం కదిపారట. ఎంఎల్ఏ సానుకూలంగా స్పందించటంతో విషయం జగన్ దాకా వెళ్ళింది. గుంటూరు వెస్ట్ ఎంఎల్ఏగా జగన్ టిక్కెట్టు హమీ ఇవ్వటంతో వీలైనంత తొందరలో పార్టీ మారాలని మోదుగుల నిర్ణయించుకున్నారట. ఈనెల మూడో వారంలో పార్టీకి, శాసనసభ్యత్వానికి మోదుగుల రాజీనామా చేసి వైసిపిలో చేరనున్నట్లు సమాచారం.


మోదుగుల విషయం పక్కనపెట్టినా మరికొంతమంది ఎంఎల్ఏలు,  నేతలు టిడిపికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాకపోతే తమ పార్టీలోకి వచ్చే వారంతా ముందుగా పదవులకు రాజీనామాలు చేయాలని జగన్ కండీషన్ పెట్టారు. అదేసమయంలో చేరాలని అనుకున్న వాళ్ళందరికి కూడా టిక్కెట్లు హామీ ఇవ్వటం లేదు. దాంతోనే చాలామంది వెనకాడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ టిడిపిలో రాజీనామాలు ఊపందుకుంటాయని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: