తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ మోదుగుల వేణుగోపాలరెడ్డి సంచలనం రేపారు. వచ్చే ఎన్నికల్లో గురజాల నియోజకవర్గంలో  పోటీ చేయబోతున్న వైసిపి అభ్యర్ధి కాసు మహేష్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని పిలుపివ్వటం జిల్లాలో, తెలుగుదేశంపార్టీలో సంచలనంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే, గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి మండలంలో రెడ్డి సామాజికవర్గం ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి పార్టీలతో సంబంధం లేకుండా రెడ్డి సామాజవకవర్గం కుటుంబాలన్నీ హాజరయ్యాయి.

 

ఆ సందర్భంగా టిడిపి ఎంఎల్ఏ మోదుగుల మాట్లాడుతూ, తెలుగుదేశంపార్టీలో రెడ్ల పరిస్ధితి మరీ దారుణంగా తయారైందన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం తమ ఓట్లు వేసేటపుడు ఆలోచించుకుని ఓట్లేయాలని చెప్పారు. తన పక్కనే కూర్చుని ఉన్న వైసిపి అభ్యర్ధి కాసు మహేష్ రెడ్డిని చూపిస్తూ మనోడికే ఓట్లేసి గెలిపించమని చెప్పటం ఇపుడు సంచలనంగా మారింది. ఎందుకంటే, ఈ నియోజకవర్గంలో టిడిపి తరపున సిట్టింగ్ ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాసరావే మళ్ళీ పోటీ చేస్తారు. అదే సందర్భంలో వైసిపి తరపున కాసు మహేష్ రెడ్డి పోటీ చేయబోతున్నట్లు జగన్ ఇప్పటికే ప్రకటించారు. అంటే రెండు ప్రధాన పార్టీల మధ్య అభ్యర్ధులు ఎవరో తేలిపోయింది.

 

స్వంత పార్టీలో పోటీ చేస్తున్న యరపతినిని కాదని వైసిపి తరపున పోటీ చేయబోయే మహేష్ రెడ్డికి ఓట్లేసి గెలిపించమని అడగటమే విడ్డూరంగా ఉంది. పార్టీ వర్గాల సమాచారం ప్రచారం మోదుగుల వ్యూహాత్మకంగానే ప్రకటన చేశారట. ఈనెలాఖరులో మోదుగుల టిడిపికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసిపి తరపున వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట ఎంపిగా పోటీ చేస్తారని కూడా ప్రచారంలో ఉంది. మోదుగుల తాజాగా మాట్లాడుతూ, వచ్చే ఎన్నకల్లో తాను నరసరావుపేట ఎంపిగా పోటీ చేయబోతున్నట్లు కూడా చెప్పటంతో అందరికి ఓ క్లారిటీ వచ్చినట్లైంది. ఎందుకంటే, టిడిపిలో మోదుగులకు నరసరావుపేట ఎంపిగా అవకాశం లేదు. కానీ తాను ఎంపిగానే పోటీ చేయబోతున్నట్లు బల్లగుద్ది మరీ చెప్పారంటే అర్ధమేంటి ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: