జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో వాస్తవాలు బయటకు వచ్చే రోజు ఎంతో దూరంలో లేదనే అనిపిస్తోంది. ఘటనపై కోర్టులో జరుగుతున్న విచారణలో న్యాయమూర్తి అడ్వకేట్ జనరల్ ను కడిగిపారేశారు. అసలు హత్యాయత్నం ఘటనపై విచారణ జరపటానికి రాష్ట్రప్రభుత్వం పరిధిలో పనిచేసే సిట్ కున్న అధికారాలు ఏంటని నిలదీశారు. ఘటన జరిగింది కేంద్రప్రభుత్వ పరిధిలోని విశాఖపట్నం విమానాశ్రయంలో కాబట్టి  విచారణ చేయాల్సింది కూడా కేంద్రప్రభుత్వంలోని విచారణ సంస్ధలే కదా అంటూ నిలదీశారు. కేసును ఎన్ఐఏకి ఎందుకు బదిలీ చేయలేదని మండిపడ్డారు. దానికి అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్పలేకపోయారు.  

 

జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏకి ఎందుకు బదిలీ చేయలేదని అడిగిన  ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవటంతో సిట్ విచారణను కోర్టు నిలిపేయాలంటూ ఆదేశించింది. కోర్టులో జరిగిన విచారణ తీరు చూస్తుంటే తొందరలోనే కేంద్రప్రభుత్వంలోని విచారణ సంస్ధ పరిధిలోకి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తోంది. అది సిబిఐ కావచ్చు లేదా నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కావచ్చు. విచారణ సంస్ధ ఏదైనా కానీ హత్యాయత్నం ఘటన వెనకున్న వాస్తవాలు బటయకు వచ్చే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 

తన హత్యకు కుట్ర జరిగిందని, కుట్రలో ప్రధాన భాగస్వామి చంద్రబాబునాయుడే అంటూ జగన్ అండ్ కో పదే పదే ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో కుట్ర కోణాన్ని కొట్టేస్తూ అసలు దాడి ఘటనే పూర్తిగా డ్రామా అంటూ చంద్రబాబు అండ్ కో ఎగతాళి చేస్తున్న విషయం కూడా అందరూ చూస్తున్నదే. రాష్ట్రప్రభుత్వ పరిధిలో పనిచేసే సిట్ విచారణ  చేస్తే చివరకు హత్యాయత్నం ఘటన ఓ డ్రామాగానే మిగిలిపోతోంది. ఎందుకంటే, సిట్ అన్నది చంద్రబాబు కనుసన్నల్లో పనిచేసేది కాబట్టి. రేపటి ఎన్నికల వరకూ విచారణను ఎలాగో నెట్టుకొచ్చేస్తే తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది.

 

ఇప్పటి వరకూ కాల్ మనీ సెక్స్ రాకెట్, విశాఖపట్నంలో భూ కుంభకోణం, ఎర్రచందనం దొంగల ఎన్ కౌంటర్ ఘటన ఇలా..సుమారు అరడజను అంశాలపై సిట్ విచారణ జరిపినా ఒక్కదానిలో కూడా నివేదికను జనాలు ముందుంచలేదు. అసలు విచారణ ఏ దశలో ఉందో కూడా తెలీదు. విశాఖ భూ కుంభకోణం విచారణలో మాత్రమే నివేదికలోని అంశాలు బయటకు వచ్చాయి. అందులో టిడిపి నేతల పాత్రే లేదని తేల్చేసింది సిట్. జగన్ హత్యాయత్నం ఘటనను కూడా అలాగే తేల్చేసే అవకాశం ఉంది. అందుకనే జగన్ థర్డ్ పార్టీ విచారణను డిమాండ్ చేస్తున్నారు. కోర్టు విచారణ సందర్భంగా జగన వాదనకు సానుకూలంగానే ఉన్నట్లు కనబడుతోంది.

 

నిజంగానే కేంద్ర దర్యాప్తును గనుక కోర్టు ఆదేశిస్తే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే, కుట్ర కోణంలో వైసిపి చెబుతున్నట్లు ఎయిరపోర్టులో క్యాంటిన్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరిని సిట్ పెద్దగా విచారించలేదు. అలాగే దాడి చేసిన నిందితుడు శ్రీనివాసును కూడా కొత్త అల్లుడుని చూసుకున్నట్లుగా సిట్ అధికారులు రోజు బిర్యానీలు పెట్టి మేపారు. రేపు కేంద్ర దర్యాప్తు మొదలైతే పరిస్ధితులు పూర్తిగా చంద్రబాబు చేతిలో నుండి జారిపోతాయి. కాబట్టి వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నిజంగానే జగన్ అనుమానిస్తున్నట్లుగా కుట్ర వెనుక పెద్దలెవరో తేలితే రేపటి ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపటం ఖాయమనే అనుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: