పవన్ కళ్యాణ్ రాజకీయంగా చేస్తున్న విమర్శలు టీడీపీ, వైసీపీ అధినాయకత్వాలకు బాగానే ఇబ్బంది పెడుతున్నాయి. అయితే పవన్ కి ఉన్న సినిమాటిక్ చరిస్మా. సామాజిక కుల బలం నేపధ్యంలో అయన్ని ఎలా డీల్ చేయాలన్న దానిపైన రెండు ప్రధాన పార్టీల్లో తరచూ తర్జన భర్జన జరుగుతోంది. చంద్రబాబును, జగన్ని వ్యక్తిగతంగా పవన్ టార్గెట్ చేయడం ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు


చెప్పిన దానికి భిన్నంగా:


పవన్ రాజకీయల్లోకి వచ్చినపుడు చెప్పిన మాటలకు ఇపుడు భిన్నంగా వెళ్తున్నాడని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. పవన్ తాను ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయనని, ఇష్యూస్ మీదనే తన పోరాటం ఉంటుందని మొదట్లో చెప్పుకొచ్చారు. కొన్నాళ్ళు అలాగే  రాజకీయం చేశారు కూడా. సడెన్ గా ఏమైందో ఏమో కానీ పవన్ రూట్ మార్చేశారు. పెద్దాయన అని కూడా చూడకుండా చంద్రబాబు వయసు గురించి రోజూ విమర్శలు చేస్తున్నారు. నిజానికి బాబు ఈ వయసులో కూడా చాలా చురుకుగా ఉంటారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవు. 


డైన‌మిక్ పొలిటీషియన్ గా అంతా ఆయన్ని భావిస్తారు. బాబుకు ఏజ్ అవుతోందన్నది ఎవరూ అనుకోని మాటే. అటువంటిది పవన్ పదే పదే దాన్ని టార్గెట్ చేయడం వ్యక్తిగత విమర్శల్లో పరాకాష్టగానే చూడాలి. . అదే విధంగా లోకేష్ విషయంలోనూ తరచూ పంచాయతీకి కూడా ఎన్నిక కాలేదని, ఏమీ తెలియదని అంటున్నారు. మన రాజ్యాంగంలో ఉన్న  అవకాశాల ప్రకారమే లోకేష్ శాసనమండలిని ఎన్నుకుని చట్ట సభకు వచ్చారు. మంత్రిగా ఆయన పనితీరు కూడా మెరుగుపరచుకుంటున్నారు. తప్పులుంటే చెప్పొచ్చు కానీ, ఆయన ఆ పదవికే పనికిరాడని ఎలా చెబుతారు. పంచాయతీ సర్పంచ్ అయితేనే మంత్రి కావాలని రూల్ ఉందా,

జగన్ పైనా :


ఇక జగన్ మీద కూడా దారుణమైన కామెంట్స్ పవన్ చేస్తున్నారు. ముఖ్యంగా మగతనం అన్న చర్చకు తెరలేపింది పవనే. మహిళలు సైతం పురుషులతో పోటీ పడుతున్న ఈ రోజుల్లో పురుషాధిక్య సమాజం స్రుష్టించిన పదం మగతనాన్ని పవన్ వాడుకోవడం అంటే మహిళా శక్తిని తక్కువ చేయడమేనని అంటున్నారు. అసెంబ్లీకి వెళ్లకపోతే మగతనం లేనట్లా. జగన్ పాదయాత్ర చేస్తున్నారుగా. జనంలో ఉంటూ సమస్యలు తెలుసుకుంటున్నారుగా. పవన్ జనం సమస్యలపై పోరాడితే ఎవరికీ అభ్యంతరం లేదు కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం మాత్రం బాధాకరమేనని అంటున్నారు.


ఇది కూడా తప్పే:


ఇక పవన్ తరచూ చేస్తున్న విమర్శలకు విసిగో, మరో కారణంతోనే జగన్ కూడా ఇపుడు నోరు చేసుకున్నారు. పవన్ పెళ్ళిళ్ల వ్యవహారం మరో మారు తెర మీదకు తెచ్చారు. ఇపుడు సరిగ్గా ఏపీ  రాజకీయం రొచ్చులోపడిపోయింది. ఈ ఇద్దరు యువ నాయకుల మధ్య మరో మారు మాటల యుధ్ధానికి తెర లేచింది. ఇంకా ఎన్ని దారుణమైన మాటలు వినాలోనని ఏపీ జనం హడలిపోతున్నారు. ఏది ఏమైనా పార్టీల అధినేతలు సహనంతో ఉండాలి. మిగిలిన వారికి ఆదర్శంగా ఉండాలి. సమస్యలపై పోరాడితే జనం హర్షిస్తారు తప్ప వ్యక్తిగత దూషణలు పట్టించుకోరు. ఇది అందరూ తెలుసుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: