తెలంగాణా ఎన్నికల తేదీ దగ్గర పడేకొద్దీ కోట్ల రూపాయలు పట్టుబడుతున్నాయి. ఈరోజు తెల్లవారి జామున హైదరాబాద్ నుండి వరంగల్ జిల్లాలోని జనగామ వైపు వెళుతున్న ఓ కారులో సుమారు రూ 6 కోట్లు బయటపడటంతో పోలీసులే ఆశ్చర్యపోయారు. పట్టుబడ్డ మొత్తం మహాకూటమిలోని ముగ్గురు అభ్యర్ధుల కోసం వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో ఎన్నికల్లో ధనప్రవాహం ఏ రేంజిలో జరుగుతోందో అర్ధమైపోతోంది. ఇప్పటి వరకూ పట్టుబడిన డబ్బే సుమారు 115 కోట్ల రూపాయలుగా ఎన్నికల సంఘమే అధికారికంగా చెప్పింది. మరి పట్టుబడని డబ్బు సుమారు ఏ వెయ్యి కోట్ల రూపాయలో ఉండొచ్చని అంచనా.

 

తెల్లవారి హైదరాబాద్-వరంగల్ హైవే రూటులో వెళుతున్న కారును అనుమానం వచ్చి పోలీసులు ఆపినపుడు విషయం బయటపడింది. కారు వెనుక సీటు క్రింద ఓ పెట్టలాంటిది తయారు చేసుకుని అందులో రూ. 5. 8 కోట్లు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే ఆ మొత్తం ఎవరికి వెళుతోందో కూడా చెప్పారు. పోలీసులు చెప్పిన ప్రకారం డబ్బంతా ముగ్గురు మహకూటమి అభ్యర్ధుల డబ్బట. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్ధి నామా నాగేశ్వరరావు, వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న గాయత్రి గ్రానైట్స్ యజమాని రవిచంద్ర, పరకాలలో పోటీ చేస్తున్న కొండాసురేఖ డబ్బుగా చెప్పారు.

 

మొత్తానికి  ఈ ఎన్నికల్లో పట్టుకున్న అతి పెద్ద మొత్తం ఇదే అని చెప్పవచ్చు. ఇప్పటి వరకూ పట్టుబడిన కోట్ల రూపాయల్లో ఎక్కువగా మహాకూటమి అభ్యర్ధులదే కావటం గమనార్హం. మొన్న కూడా శేరిలింగంపల్లిలో పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్ధి భవ్య ఆనంద ప్రసాద్ కు చెందిన రూ. 80 లక్షలు పట్టుబడ్డాయి. అంతుకుముందు కూడా లక్షల రూపాయలు చాలామంది దగ్గర పట్టుబడ్డాయి. టిఆర్ఎస్ అభ్యర్ధులు, నేతల దగ్గర కూడా పట్టుబడ్డాయనుకోండి అది వేరే సంగతి. అధికారంలో టిఆర్ఎస్ ఉంది కాబట్టి వాళ్ళ నేతలపై పోలీసుల దృష్టి అంతగా ఉండదని అందరికీ తెలిసిందే. దాని ఆధారంగా చేసుకుని టిఆర్ఎస్ నేతలు రెచ్చిపోతున్నారు. దానికితోడు డబ్బు పంపిణీలో చంద్రబాబునాయుడు పాత్రపై బాగా ప్రచారం జరగటంతో పోలీసులు మహాకూటమి అభ్యర్ధులు అందులోను టిడిపి అభ్యర్ధులు పోటీ చేస్తున్న నియోకవర్గాలపై బాగా దృష్టి పెట్టారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: