చూడబోతే పరిస్ధితి అలాగే కనిపిస్తోంది. నాలుగున్నరేళ్ళు పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కెసియార్ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అంటే భయపడటం విచిత్రంగానే ఉంది. రేవంత్ అరెస్టుకు ఎన్నికల కమీషనర్ రజత్ కుమార్ చెప్పిన కారణం మరీ సిల్లీగా ఉంది. లేకపోతే కొండగల్ లో బహిరంగసభకు కెసియార్ వస్తున్న సమయంలో రేవంత్ ను ముందస్తుగా అరెస్టు చేయటం దేనికి సంకేతం ? కెసియార్ వస్తున్న సమయంలో కొడంగల్ బంద్ కు కాంగ్రెస్ పిలుపిచ్చిన కారణంగానే తాము రేవంత్ ను అరెస్టు చేసినట్లు ఎన్నికల కమీషనర్ రజత్ కుమార్ చెప్పటం మరింత విడ్డూరంగా ఉంది.

కెసియార్ బహిరంగసభకు రేవంత్ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ అడ్డంకులు సృష్టిస్తారని టిఆర్ఎస్ అనుమానంతో ఉందన్నది అర్ధమవుతోంది. దానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రకటనను అడ్డం పెట్టుకుని ఎన్నికల కమీషనన్ ద్వారా ఏకంగా రేవంత్ ను అరెస్టు  చేయించారు. నిజంగానే రేవంత్ వల్ల కెసియార్ సభ భగ్నమవుతుందని ఎన్నికల కమీషన్ అనుమానిస్తే రేవంత్ ను కొడంగల్ లో లేకుండా బయటకు ఎక్కడైనా పంపేయొచ్చు. అంతేకానీ ఓ ప్రకటన కారణంతోనే ముందస్తుగా అదుపులోకి తీసుకోవటం ఏమిటో అర్ధం కావటం లేదు.

 

ఎన్నికల వేడి బాగా రాజుకున్న సమమంలో అదికూడా మరో 24 గంటల్లో ప్రచారం ముగిసి పోతుందనగా ఎక్కడా తిరగనీయకుండా రేవంత్ ను అరెస్టు చేయటమంటే ఏదో కుట్ర ఉందని అర్ధమైపోతోంది. రేవంత్ ను ఎక్కడా ప్రచారం చేయనీయకుండా కనీసం సొంత  నియోజకవర్గం కొడంగల్లో కూడా తిరగనీయకుండా కట్టడి చేయటమే టిఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. జరిగుతున్న దాన్నిబట్టి రేవంత్ అంటే కెసియార్ భయపడుతున్నారనే అనుకోవాల్సొస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: