ఏపీలో సాధారణ ఎన్నికల వేడి ప్రారంభం అయిన వేళ‌ రాజధాని జిల్లా అయిన గుంటూరులో టీడీపీకి షాకుల మీద షాకులు తప్పేలా లేవు. ఈ జిల్లా నుంచి ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు టీడీపీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే వరసలో టీడీపీలో అసంతృప్తితో ఉన్న మరో ఎమ్మెల్యే సైతం టీడీపీకి షాక్‌ ఇచ్చి వైసీపీలోకి జంప్‌ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాస్తవానికి గుంటూరు జిల్లాలో గత ఏడాది కాలంగా పార్టీ మారిన రావెల కిషోర్‌బాబుతో పాటు, గుంటూరు వెస్ట్‌ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి పార్టీ మారతారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. టీడీపీలో నిత్య అసంతృప్తి వాదులుగా ఉన్న వీరిద్దరిని సంతృప్తి పరచడం తమ వల్ల కాదని అటు చంద్రబాబు నుంచి ఇటు జిల్లా పార్టీ నేతలు సైతం చేతులు ఎత్తేసారు. 


గత ఎన్నికలకు ముందు ఐఆర్‌ఎస్‌ అధికారిగా ఉన్న రావెల కిషోర్‌బాబు పార్టీలో చేరి చేరకుండానే  ప్రత్తిపాడు టీడీపీ సీటు దక్కించుకోవడం ఆ నియోజకవర్గానికి ముక్కుమొహం తెలియకపోయినా ఎమ్మెల్యేగా గెలవడం.. వెంటనే సామాజిక సమీకరణల నేపథ్యంలో మంత్రి అవ్వడం చకచకా జరిగిపోయాయి. కాని అందివచ్చిన లక్కీ ఛాన్స్‌ను అందిపుచ్చుకోవడంలో ఘోరంగా విఫలం అయిన రావెలను చంద్రబాబు మంత్రివర్గ ప్రక్షాళ‌న‌లో ఆయ‌న్ను తప్పించేశారు. రావెల మంత్రిగా ఉన్నా, మంత్రి పదవి నుంచి తొలగించినా ఆయన తీరు మాత్రం మార్చుకోలేదు. పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలకు పాలుపడుతూ అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరించారు. ఆయన కుమారుల తీరుతో సైతం చంద్రబాబుకు ఎన్నో తలనొప్పులు వచ్చాయి. చివరకు రావెల తనంతట తానే పార్టీ నుంచి బయటకు వెళ్లారు. ఎంత దారుణం అంటే వైసీపీ వాళ్లు సైతం రావెలను చేర్చుకునేందుకు ఇష్టపడకపోతే ఆయన చివరకు జనసేనలోకి వెళ్లాల్సి వచ్చింది.


రెండో వికెట్‌ మోదుగులదేనా..?
ఇక మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా అనూహ్యంగా ప్రారంభం అయ్యింది. తొలుత ప్రజారాజ్యంలో చేరి హడావిడి చేసి చివరకు ఆ పార్టీకి రాజీనామా చేసి 2009 ఎన్నికల్లో చివరి క్షణంలో నరసారావుపేట ఎంపీ సీటు దక్కించుకున్న ఆయన నరసారావుపేట లోక్‌సభ సెగ్మెంట్‌ పరిదిలో ఉన్న టీడీపీ అభ్యర్థుల ప్రభావంతో ఎంపీగా విజయం సాధించారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు గుంటూరు వెస్ట్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కల్పించారు. తన ఎంపీ సీటును త్యాగం చేసినందుకు మంత్రి పదవి వస్తుందని మోదుగులు బహిరంగంగా చాలా సార్లు ప్రచారం చేసుకున్నారు. 2014లో మోదుగులకు మంత్రి పదవి రాలేదు. గత ఏడాది జరిగిన ప్రక్షాళ‌న‌లో సైతం తనకు గ్యారెంటీగా క్యాబినెట్‌ బెర్త్‌ వస్తుందని ఆయన ఆశించారు. అయితే చంద్రబాబు వైసీపీ నుంచి వచ్చిన రెడ్లకు పదవులు కట్టపెట్టారు. దీంతో అలకభూనిన మోదుగుల పదే పదే ప్రభుత్వం, పార్టీపై బహిరంగ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. 


ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనూ తన మాట చెట్టుబాటు కావడంలేదన్న అసంతృప్తి ఆయనలో తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో అయినా తాను కోరుకున్న సీటు టీడీపీలో దక్కుతుందన్న అన్న కాన్ఫిడెన్స్‌ మోదుగులలో లేదు. ఈ క్రమంలోనే వైసీపీలోకి జంప్‌ చేసేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారని గత నాలుగైదు నెలలుగా వార్తలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున మోదుగుల పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆ పార్టీ వాళ్లు సర్వేలు సైతం చేస్తున్నారు. ఎన్నికలకు కాస్త ముందుగా మోదుగుల టీడీపీని వీడి వైసీపీలోకి జంప్‌ చేస్తారని ఆయన సత్తెనపల్లి నుంచి ఆ పార్టీ తరపున అసెంబ్లీకి పోటీ చేస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ర‌సారావుపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తాన‌ని... ఏ పార్టీ త‌ర‌పున అనేది త్వ‌ర‌లోనే చెపుతాన‌ని చేసిన వ్యాఖ్య‌ను బ‌ట్టి ఆయ‌న చూపు ఎంపీ వైపు కూడా ఉందంటున్నారు.


ఇక మోదుగుల సైతం తాజాగా గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో జరిగిన రెడ్డి సామాజికవర్గ వ‌న‌స‌మారాధ‌న‌లో మాట్లాడుతూ టీడీపీలో రెడ్లకు ప్రాధన్యత లేదన్న కామెంట్లు చెయ్యడం సైతం రాజకీయ వర్గాల్లో ప్రకంపన‌లు రేపుతున్నాయి. గురజాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో మన సామాజికవర్గ అభ్యర్థినే గెలిపించుకుందాం అని సైతం ఆయన కామెంట్‌ చేసినట్టు తెలుస్తోంది. మోదుగుల చేసిన ఈ వ్యాఖ్య గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డిని గెలిపించాలని పరోక్షంగా చెప్పినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీనిని బట్టీ మోదుగుల ఆవసరాలకు మాత్రమే ప్రస్తుతానికి టీడీపీలో ఉన్నారని ఆయన మనసంతా వైసీపీలో ఉందని కూడా గుంటూరు జిల్లాలో చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైన గుంటూరు జిల్లా టీడీపీలో ఇప్పటికే రావెల రూపంలో ఫస్ట్‌ వికెట్‌ పడగా రెండో వికెట్‌ మోదుగులే అన్న టాక్‌ జిల్లాలో ఇప్పటికే బాగా స్ప్రెడ్‌ అయిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: