తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఓటేసే సమయం దగ్గరపడింది. పోలింగ్ ముహూర్తం కొన్ని గంటలే ఉంది. భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కుల్లో ఓటు హక్కు చాలా విలువైంది. ఆ నేను ఒక్కడినీ ఓటేయకపోతే ఏమవుతుందిలే అన్న బద్దకం అస్సలు పనికిరాదు. ఎందుకంటే ఒక్క ఓటుతోనే చరిత్ర అనేక మలుపులు తిరిగింది. ఒక్క ఓటుతో అజాత శత్రువైన వాజ్ పేయి ప్రభుత్వం పడిపోయింది. ఒక్క ఓటుతోనే భారత రాజభాషగా సంస్కతం కాదని హిందీ ఎన్నికైంది.

మనం వేసే ఒక్క ఓటుతో ఓ అభ్యర్థి, ఓ పార్టీ ఐదేళ్లపాటు అధికారం దఖలు పడుతుంది. ఒక్క గంట సేపు క్యూలో ఉంటే మంచి వ్యక్తిని ఎన్నుకోవచ్చు. అందుకే మన ఓటు హక్కు వినియోగించుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. బరిలో ఉన్న అభ్యర్థుల చరిత్రలు పరిశీలించాలి. కేవలం పార్టీని మాత్రమే కాదు.. అభ్యర్థిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.




మంచి అభ్యర్థిని ఎన్నుకోవడంలో ఓటరుకు కూడా చాలా చిక్కులు ఉన్నాయి. ఎందుకంటే.. అన్ని పార్టీలూ ధనబలం, కులబలం, అంగబలం ఉన్న అభ్యర్థులకే అవకాశాలు ఇస్తున్నాయి. మరి బరిలో ఉన్న వారందరూ అంత మంచి వాళ్లు కాకపోతే ఏంచేయాలి.. అప్పుడు తక్కువ చెడ్డవాళ్లను ఎన్నుకోవాలి. అలా కాకుండా బరిలో ఉన్న వారిలో ఎవరూ మంచిగా అనిపించకపోతే.. కనీసం నోటాకు అయినా ఓటేయాలి తప్ప.. ఓటేయడం మానకూడదు.



మరి ఇప్పుడు తెలంగాణ బరిలో ఉన్న అభ్యర్థుల నేర చరిత్రలు ఒక్కసారి పరిశీలిద్దాం.. ప్రతి అభ్యర్థి తన నేర చరిత్రను, తనపై ఉన్న పోలీస్ కేసులను తప్పుకుండా ఎన్నికల అఫిడవిట్ లో పేర్కోవాలని ఎన్నికల కమిషన్ నిబంధన విధించింది. అంతే కాదు.. తమ నేర చరిత్రపై పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని కూడా ఈసీ నిబంధన విధించింది.

తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల నేర చరిత్రలను నిశితంగా పరిశీలిస్తే.. తెలంగాణవ్యాప్తంగా మొత్తం ఎన్నికల బరిలో 1821 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరికి చెందిన 1777 అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ అనే స్వచ్ఛంద సంస్థ నిశితంగా పరిశీలించింది. ఆ వివరాల ప్రకారం.. మొత్తం 368 అభ్యర్థులపై ఏదో ఒక పోలీసు కేసు ఉంది. ఇందులో 231 మందిపై తీవ్రమైన నేరాభియోగాలతో కూడిన కేసులు ఉన్నాయి. అంటే హత్య, కిడ్నాప్, మహిళలపై దాడి, అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలన్నమాట.



మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ బరిలో ఉన్న వ్యక్తుల్లో ఆరుగురిపై హత్య ఆరోపణలు ఉన్నాయి. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం.. వీరిపై కేసులు నమోదయ్యాయి. మరో 24 మందిపై హత్యాయత్నం అభియోగాలు, కేసులు ఉన్నాయి. మరో నలుగురిపై కిడ్నాప్ కేసులున్నాయి. మరో 21 మందిపై గృహ హింస, మహిళలపై వేధింపులు వంటి కేసులు ఉన్నాయి.

ఇక పార్టీల వారీగా చూస్తే.. మొత్తం నేర చరిత్ర కలిగి ఉన్న వారిలో 70 శాతం మంది కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజాకూటమి తరపున బరిలో దిగిన అభ్యర్థులే ఉన్నారు. 55 శాతం మంది టీఆర్ఎస్ నుంచి.. 37 శాతం మంది బీజేపీ నుంచి, 27 శాతం మంది బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు.



మొత్తం పది కంటే ఎక్కువ కేసులు ఉన్నవారు.. 14 మంది వరకూ ఉన్నారు. వీరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ 64 కేసులతో అగ్రస్థానంలో ఉన్నారు. అయితే ఇవన్నీఆయన ఉద్యమ సమయంలో పెట్టినవే కావడం విశేషం. ఆ తర్వాత స్థానంలో బోథ్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న సోయం బాపూరావు 52 కేసులతో రెండో స్థానంలో ఉన్నారు. ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న ఆత్రం సక్కుపై 45 కేసులు ఉన్నాయి.

20 కంటే ఎక్కువ పోలీసు కేసులు ఉన్న వారి వివరాలు పట్టిక రూపంలో...

టి.రాజాసింగ్ - గోషామహల్- బీజేపీ- 43 కేసులు

హరీశ్ రావు - సిద్ధిపేట- టీఆర్‌ఎస్ - 41 కేసులు

రేవంత్ రెడ్డి - కొడంగల్ - కాంగ్రెస్ - 36 కేసులు

ప్రేమ్ సాగర్ రావు - మంచిర్యాల- కాంగ్రెస్ - 26 కేసులు

వంటేరు ప్రతాప్ రెడ్డి - గజ్వేల్ - కాంగ్రెస్ - 22 కేసులు



ఇదీ.. తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల నేర చరిత్ర.. అందుకే తెలంగాణ ఓటరు మేలుకోవాల్సిన అవసరం ఉంది. మంచి వారిని ఎన్నుకోకపోయినా ఫరవాలేదు. కానీ నేర చరిత్రులను ఎన్నుకుంటే.. దానికి ఐదేళ్లు మూల్యం చెల్లించక తప్పదు. అందుకే ప్రతి ఓటరు తమ అభ్యర్థుల నేర చరిత్రను పరిశీలించాలి. తెలివైన నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ ఓటరా మేలుకో.. ఆలోచించి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించు.


మరింత సమాచారం తెలుసుకోండి: