తెలంగాణాలో ఈ రోజుతో ఎన్నికల ప్రచారం పూర్తి అయిపోతోంది. ఇక మరో నలభై ఎనిమిది గంటల్లో జనం తమ తీర్పును చెప్పబోతున్నారు. కేసీయార్ అసెంబ్లీని రద్దు చేసిన తొంబయి రోజులకు ప్రజలు తమ మనసులో మాటను బయటపెట్టనున్నారు. అతి ధీమాతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన కేసీయార్ గెలుస్తారా, ఆయన్ని పక్కకు నెట్టి ప్రజా కూటమి దూసుకు వస్తుందా ఇపుడు ఇదే తెలంగాణాలో ఆసక్తికరమైన చర్చ


లగడపాటి సర్వే:


నిజానికి ఎన్నికల వేళ ఎటువంటి సర్వేలు వెల్లడించకూడదని ఓ వైపు ఎన్నికలక సంఘం నియమాలు పెట్టింది. కానీ ఎవరూ ఆ మాట విన్నట్లు కనిపించడంలేదు. ఓ టీవీ చానల్ మొన్న టీయారెస్ కి అనుకూలంగా సర్వే వెల్లడిస్తే నిన్న పోటీకా అన్నట్లుగా లగడపాటి సర్వే వెలువరించారు. సహజంగానే ఈ సర్వే కూటమికి అనుకూలంగానే ఉంది. లగడపాటి సర్వే అంటే అందరికీ ఓ నమ్మకం ఉంది. గతంలో ఆయన చేసిన పలు సర్వేలు నిజం అయ్యాయి కూడా. అయితే ఈసారి ఆయన సర్వే మరీ నూరు శాతం నమ్మేలా కనిపించడంలేదు, అలాగని కొట్టిపారేయడానికీ లేకుండా ఉంది.దాంతోనే వస్తోంది జగడం.


క్లారిటీ మిస్ :


ఈ సర్వేలో కూడా లగడపాటి తాను సేఫ్ జోన్లో ఉంటూనే వివరాలు బయటపెట్టారు. ఒకవేళ బొమ్మ తిరగబడినా లగడపాటి వారి సర్వే ఆ వైపు నుంచి కూడా చెప్పుకునేందుకు వీలుగా ఉండేలాగనే చూసుకున్నారని సెటైర్లు పడుతున్నాయి. ఈ సర్వేలో కూటమి గెలుస్తుందని చూచాయగా చెప్పిన లగడపాటి అది ఎప్పుడూ అంటే పోలింగ్ అధిక శాతం నమోదు అయినపుడు అని కండిషన్ పెట్టారు. పోలింగ్ తక్కువ జరిగితే హంగ్ వస్తుందని అన్నారు. 
నిజానికి హంగ్ వస్తే అది టీయారెస్ కే ఉపయోగం అన్నది తెల్సిందే. ఆయనకు మజ్లిస్ సపోర్ట్ ఉంది. పైగా ఇండిపెండెంట్లు గెలిస్తే తీసుకునే వెసులుబాటూ ఉంది. ఇలా ఓ వైపు కూటమి అంటూ మరోవైపు టీయారెస్ ఆశలనూ పూర్తిగా తీసేయకుండా లగడపాటి వారు సర్వే వినిపించారని అంటున్నారు.


ఒక్కటి నిజం :


ఈ సర్వేల తీరు ఎలా ఉన్నా ఒక్కటి మాత్రం నిజమయ్యేలా కనిపిస్తోంది. అదేంటంటే మొదట్లో టీయారెస్ అనుకున్నట్లుగా వందకు వంద సీట్లు రానే రావు, అలాగే కూటమిలో ఇపుడు జోరు బాగా పెరిగింది అనుకున్నా సూపర్ మెజారిటీతో  అధికారంలోకి వచ్చేంతగా ఆ సీను లేదని కూడా లగడపాటి సర్వేలతో సహా అన్నీ క్రోడీకరించి చూస్తే తెలుసుతున్న వాస్తవం.
 ఇపుడు తెలంగాణాలో భీకరమైన పోరు జరుగుతోంది. అది దాదాపుగా అందరూ అంగీకరించే నిజం. అందువల్ల రేపటి రోజున ఎవరు గెలిచినా సింపుల్ మెజారిటీయేనని సర్వేలు ఘొషిస్తున్నాయనుకోవాలి. మొత్తానికి సర్వేల పేరుతో లగడపాటి సహా అంతా జగడాలు పెడుతున్నారనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: