మాజీ ఎంపి, ఎన్నికల సర్వేల్లో ఆంధ్రా ఆక్టోపస్ గా పాపులరైన లగడపాటి రాజగోపాల్ తాజాగా విడుదల చేస్తున్న సర్వే నివేదికలపై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. మామూలుగా అయితే, లగడపాటి సర్వే నివేదికలంటే అందరిలోను చాలా నమ్మకం. ఎందుకంటే, ఆయన చేయించే సర్వేల్లో చాలా వరకూ నిజాలుగా తర్వాత తేలాయి కాబట్టి. కాకపోతే అక్కడక్కడ బోల్తా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయనుకోండి అది వేరే సంగతి. ప్రస్తుత విషయానికి  వస్తే తెలంగాణా ఎన్నికలు అందరిలోను తీవ్ర ఉత్కంఠనను రేపుతున్నాయి. ఒకవైపు టిఆర్ఎస్, మరోవైపు మహాకూటమి పోటీ పోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఎవరికి వారు తమకు అనుకూలంగా సర్వే ఫలితాలంటూ లీకులిచ్చి ఓటర్లలో అయోమయం సృష్టిస్తున్నాయి.

 

ఇటువంటి నేపధ్యంలో లగడపాటి రంగంలోకి దిగారు. దాంతో మిగిలిన సర్వేల నివేదికలు ఎలాగున్నా అందరి దృష్టి లగడపాటి సర్వేలపైనే పడింది. కాకపోతే తాజాగా లగడపాటి బయటపెడుతున్న నివేదికలపై అందరిలోను అనామానాలు పెరిగిపోతున్నాయి. లగడపాటి బయటపెడుతున్న నివేదికలు చూస్తుంటే అదేదో చంద్రబాబునాయుడు మెప్పుకోసమో లేకపోతే మహాకూటమిని ఆదుకోవటం కోసమో లగడపాటి నివేదికలు విడుదల చేస్తున్నారా అని అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

రాబోయే ఎన్నికల్లో 10 మంది స్వతంత్ర అభ్యర్ధులు గెలుస్తారని చెప్పటంతో అందరిలోను టెన్షన్ పెరిగిపోయింది. 10 మంది ఇండిపెండెట్లు గెలుస్తారంటే హంగ్ తప్పదేమో అన్న చర్చ కూడా మొదలైంది. మొదటి రెండు పేర్లు తర్వాత మూడు పేర్లను లగడపాటి రిలీజ్ చేశారు. రెండోసారి లిస్ట్ రిలీజ్ చేసేటపుడు లగడపాటి హావభావాలు గమనిస్తే ఏదో మొహమాటానికి లిస్ట్ రిలీజ్ చేస్తున్నట్లనిపించింది. ఖమ్మం, నల్టొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలు మహాకూటమికి, వరంగల్ , నిజామాబాద్, మెదక్ జిల్లాలు టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని చెప్పటం విచిత్రంగా ఉంది. అంటే నాలుగు జిల్లాలు మహాకూటమి ఖాతాలో వేసి మూడు జిల్లాలు టిఆర్ఎస్ ఖాతాలో వేశారు.

 

పైగా పోలింగ్ శాతం 68.5 శాతం కన్నా పెరిగితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు, తగ్గితే హంగ్ ఏర్పడే అవకాశాలున్నట్లు చెప్పారు. నిజానికి నాలుగు జిల్లాలు మహాకూటమికి, మూడు జిల్లాలు టిఆర్ఎస్ కు అనుకూలమని చెప్పటానికి లగడపాటే అవసరం లేదు. రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళెవరైనా చెప్పగలరు. అలాగే, పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, తగ్గితే హంగ్ వస్తుందని కూడా లగడపాటి చెప్పక్కర్లేదు. ఆమాత్రం ఫలితాలను ఎవరైనా ఊహించగలరు. లగడపాటి చెప్పాల్సిందేమిటంటే, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదెవరు ? అన్న విషయాన్నే సూటిగా చెప్పాలి. సర్వేలు చేయించి ఫలితాలు చెప్పే విషయంలోనే లగడపాటి ఫేమస్. అంతే కానీ గోడమీద పిల్లివాటంలాగ నివేదికలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి ?

 

ఇక్కడే లగడపాటి రిలీజ్ చేస్తున్న ఫలితాలపై అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి. దానికితోడు పోయిన నెల 20వ తేదీన కెటియార్ కు ఇచ్చిన మెసేజ్ లో 70 సీట్లతో టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. కానీ ఇపుడు చెబుతున్న లెక్కల్లో మహాకూటమికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. సరే, ఓటరు నాడి ఎప్పటికప్పుడు మారిపోయే అవకాశాలు లేకపోలేదు. కెటియార్ కు ఇచ్చిన మెసేజ్ కు ఇప్పటికి మధ్య 13 రోజులు గడచిపోయింది.


ఎక్కడైనా ఒకటి అరా ఓట్ల శాతంలో మార్పు రావచ్చు చెప్పలేం. కానీ 70 సీట్లకు పైగా సాధిస్తుందన్న టిఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చుంటుందన్నట్లుగా తాజాగా చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో టిడిపి తరపున ఖమ్మం స్ధానంలో లగడపాటి పోటీ చేస్తాడనే ప్రచారం అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్లే లగడపాటి ఇప్పటి ఎన్నికల్లో వేదిక ప్రిపేర్ చేసుకుంటున్నారా అన్న ప్రచారం కూడా ఊపందుకుంటోంది. 7వ తేదీ పోలింగ్ అయిపోగానే పూర్తి ఫలితాలు విడుదల  చేస్తానంటున్నారు కదా ? చూద్దాం అప్పుడేమని చెబుతారో ?


మరింత సమాచారం తెలుసుకోండి: