సర్వేల సంచలనం లగడపాటి మరో సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఓడిపోబోతున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి బరిలో దిగిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓడిపోతున్నారని మీడియాతో చెప్పారు. ఈ విషయం తాను చెప్పడం కాదని.. అక్కడి పోలీసులే తనకు చెప్పారని వివరించారు.



ఇటీవల తాను గజ్వేల్ వెళ్లానని.. తన కారును తనిఖీ చేసిన పోలీసులు గుర్తుపట్టి తనతో కాసేపు మాట్లాడారని లగడపాటి తెలిపారు. తన సర్వే ఎలా ఉందని పోలీసులు ఆసక్తిగా అడిగారని తెలిపారు. ఆ సమయంలో గజ్వేల్ లో పరిస్థితి ఎలా ఉందని తాను పోలీసులను అడిగితే ఇక్కడ కేసీఆర్ ఓడిపోతారని వారు చెప్పారని లగడపాటి తెలిపారు. లేదు.. కేసీఆర్ గెలుస్తారని తాను చెప్పానని.. అందుకు వారు కావాలంటే డిసెంబర్ 11న చూడండి.. మా మాటే నెగ్గుతుందని పోలీసులు నమ్మకంగా చెప్పారని రాజగోపాల్ వివరించారు.



తెలంగాణ ఎన్నికలపై సర్వే గురించి వరుసగా రెండు రోజులపాటు మీడియా ముందుకు వచ్చిన లగడపాటి మహా కూటమిదే తెలంగాణ ఎన్నకల్లో విజయమని మరోసారి తేల్చి చెప్పారు. తన సర్వేపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తనతో జరిపిన సంభాషణను బయటపెట్టడంపై ఆయన మీడియాకు వివరణ ఇచ్చారు. కేటీఆరే స్వయంగా వచ్చి తనను కలిశారని వివరించారు.



కేసీఆర్ సిట్టింగులందరికీ మళ్లీ టిక్కెట్లు ఇవ్వడం టీఆర్ఎస్ కొంప ముంచిందని లగడపాటి విశ్లేషించారు. కలసి వస్తామన్న టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో ఇంత పోటాపోటీ ఉండేది కాదని.. అప్పుడు వార్ వన్ సైడ్ అయ్యేదని లగడపాటి అంచనా వేశారు. మొత్తానికి కేసీఆర్ సైతం ఓడిపోతారని లగడపాటి చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. అయితే ఆ విషయం తన సర్వేలో తేలినట్టు చెప్పకపోవడం కొసమెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి: