సీమాంధ్రులన్నారు. నందమూరి సుహాసిని అన్నారు. సీమాంధ్రులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి గెలుపు నల్లేరుపై నడకే అన్నారు. తీరా ఎన్నికల గోదాలోకి దింపిన తర్వాత పోలింగ్ కు ఒకరోజుందనగా ఇపుడందరూ పాపం సుహాసిని అంటున్నారు. మహాకూటమి అభ్యర్ధిగా తెలుగుదేశంపార్టీ తరపున పోటీ చేస్తున్న చుండ్రు అలియాస్ నందమూరి సుహాసిని పరిస్ధితి దయనీయంగా ఉందనేది సమాచారం. క్షేత్రస్ధాయి నుండి అందుతున్న సమాచారం ప్రకారం సుహాసిని గెలుపు కష్టమే అంటున్నారు. అందుకు చాలా కారణాలే ఉన్నాయి.

 

మొదటిది ఎన్నికల్లోకి దిగేంతవరకూ సుహాసిని ఎవరికీ తెలీని వ్యక్తి. రెండోది కూటమిలోని పార్టీలు పెద్దగా కలిసి రావటం లేదు. మూడోది నియోజకవర్గంలోని సామాజికవర్గాల్లో ఒక్క కమ్మ సామాజికవర్గం ఓటర్లు తప్ప మిగిలిన సామాజికవర్గాల్లో చాలా వరకూ వ్యతిరేకిస్తున్నాయట. నియోజకవర్గంలోని సుమారు 3 లక్షల ఓట్లలో  కాపు, బిసి, రెడ్లు, ముస్లింలు, ఎస్సీలు, బ్రాహ్మిన్, కమ్మ ఓటర్లున్నారు. వారిలో కమ్మ ఓట్లు మహా ఉంటే ఓ 13 వేలుంటాయి. కాపులు, బిసిలు, ముస్లింలు, రెడ్ల ఓట్లే ప్రధానం. వీటిల్లో కాపు, ముస్లిం, బ్రాహ్మిన్, రెడ్లు వ్యతిరేకంగా ఉన్నారట.

 

సుహాసిని విషయంలో నాలుగు సామాజికవర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయన్న ప్రచారానికి కూడా ఓ కారణం ఉంది. ఏపిలో కాపులు, ముస్లింలు, బ్రాహ్మిన్, రెడ్లు చంద్రబాబునాయుడు అంటే మండుతున్నారు. కుకట్ పల్లిలో సుహాసినిని గనుక ఓట్లేసి గెలిపిస్తే ఏపిలో చంద్రబాబు పాలనకు మద్దతిచ్చినట్లు అవుతుందని అనుకుంటున్నారని సమాచారం. రిజర్వేషన్ల అంశంతో కాపులు, ముస్లింలు, తమను పట్టించుకోలేదని బ్రాహ్మణులు, సహజ వైరం వల్ల రెడ్లు చంద్రబాబుపై ఏపిలో మండిపోతున్న విషయం అందరికీ తెలిసిందే.

 

సుహాసిని నామినేషన్ వేసిన దగ్గర నుండి కూడా ఆమె గెలుపు బ్రహ్మాండమని ఎక్కడా వినిపించటం లేదు. కేవలం చంద్రబాబుకు మద్దతుగా నిలిచే మీడియాలో మాత్రమే సుహాసినికి మద్దతుగా కథనాలు వండి వార్చారు. ఆ వండి వార్చిన కథనాలు కూడా ఎక్కువైపోయి వెగటు పుట్టేశాయి. జూనియర్ ఎన్టీయార్, కల్యాణ్ రామ్ లు సుహాసిని ప్రచారంలో పాల్గొంటారని మూడు రోజుల పాటు నియోజకవర్గంలో తిరుగుతారంటూ పదే పదే ఊదరగొట్టారు.

 

నిజానికి పై ఇద్దరు కూడా సుహాసిని ప్రచారానికి రావాలని అనకోలేదు. తాము రాదలుచుకోకపోయినా తమ పేరు మీద జరుగుతున్న ప్రాచారంతో వాళ్ళిద్దరికీ చిర్రెత్తుకొచ్చిందట. ఇటువంటి అసంబద్దమైన కథనాలతో కూడా జాతి మీడియా సుహాసినికి నష్టమే చేసింది. అదే సందర్భంలో బాబాయ్ నందమూరి బాలకృష్ణ ప్రచారం వల్ల నష్టమే  జరిగింది. ఎందుకంటే, బాలయ్య ఏం మాట్లాడుతారో ఆయనే తెలీదు. జూనియర్ ఎన్టీయార్, కల్యాణ్ రామ్ గురించి పదే పదే రాసిన మీడియా ఒక్కసారి కూడా నారా లోకేష్ రాని విషయాన్ని ప్రస్తావించకపోవటం విచిత్రం.


మరింత సమాచారం తెలుసుకోండి: