తెలంగాణలో ఓటరు తీర్పుకు సమయం ఆసన్నమైన వేళ తెలంగాణ ముఖ్యమంత్రి చివరి రెండు రోజులు కుమ్మేశారు.. ఏ విషయంలో అంటారా.. ఎన్నికల సమయంలో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చే విషయంలో..ఎన్నికలకు పది రోజుల ముందు నుంచీ కాంగ్రెస్ పార్టీ పత్రికల్లో ఫుల్ పేజీల యాడ్లు ఇచ్చి కుమ్మేసింది. మొదటి నుంచి ఇందులో వెనుకబడిన టీఆర్ఎస్.. చివరి రెండు రోజులు మాత్రం దాదాపు అన్ని పత్రికలకూ ఫుల్ ఫ్రంట్ పేజీ ప్రకటనలు గుప్పించింది.


తెలంగాణ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ సమీకరణాలు వేగంగా మారాయి. కేసీఆర్ ముందస్తుకు వెళ్తున్నట్టు ప్రకటించిన రోజు మొత్తం సీన్ అంతా టీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అసలు నామమాత్రపు పోటీ అయినా ఇస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఆ పార్టీకి పరిస్థితులు అనుకూలంగా మారాయి. చివరకు టీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహా కూటమి గట్టి పోటీ ఇస్తోంది. అంతే కాదు.. లగడపాటి వంటి సర్వే కింగులు హస్తందే విజయం అని ప్రకటించే స్థాయికి కాంగ్రెస్ ఎదిగింది.


ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్ జోరు చూపించింది. ప్రత్యేకించి పత్రికల్లో ప్రకటనల విషయంలో కాంగ్రెస్ విచ్చలవిడిగా ప్రకటనలు ఇచ్చింది. తెలుగు, ఇంగ్లీష్ పత్రికలన్నింటిలోనూ జాకెట్ యాడ్లు ఇచ్చి.. ప్రజాకూటమి వస్తుంది.. ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తుంది అంటూ ఉదరగొట్టేసింది. పత్రికలకు ప్రకటనల విషయంలో సహజంగా ఉదారంగా ఉండే టీఆర్ఎస్ ఎన్నికల సమయంలో మాత్రం ఎందుకనో ఉదాసీనత ప్రదర్శించింది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా విచ్చలవిడిగా పత్రికలకు యాడ్స్ ఇచ్చేది.


మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు.. ఇలా ఏ పథకం ప్రవేశపెట్టినా.. టీఆర్ఎస్ సర్కారు వార్షికోత్సవాల సమయంలోనూ పత్రికలు ప్రభుత్వ ప్రకటనలతో నిండిపోయేవి. కానీ ఎందుకో ఎన్నికల సమయంలో మాత్రం టీఆర్ఎస్ యాడ్లు పెద్దగా పత్రికల్లో కనిపించ లేదు. మొత్తానికి పోలింగ్ కు సరిగ్గా రెండు రోజులు మాత్రం అన్ని పత్రికలనూ తన ఫుల్ పేజీ యాడ్లతో నింపేసింది. మరి ఓటరు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: