తెలంగాణా సీనియర్ నేత, ఆలేరులో పోటీ చేస్తున్న మోత్కుపల్లి నరసింహులు ఆసుపత్రిలో చేరారు. గురువారం హఠాత్తుగా చాతినొప్పితో పాటు వాంతులు మొదలవ్వటంతో మోత్కుపల్లిని భువనగిరిలోని ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ప్రాధమిక చికిత్స చేసిన తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని సుప్రజ ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల్లో యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో మోత్కుపల్లిలో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్ధిగా రంగంలోకి దిగారు. నిజానికి పోటీలో ఉన్న ఇతర అభ్యర్ధులకన్నా మోత్కుపల్లి అన్నీ విధాలుగాను వెనకబడ్డారని సమాచారం. దాంతో పాటు ఇతరత్రా రాజకీయ ఒత్తిళ్ళు ఎక్కువైపోయాయి. దాంతో అస్వస్ధతకు గురైనట్లు తెలుస్తోంది.

 

మోత్కుపల్లికి చాలాకాలంగా చంద్రబాబునాయుడుతో పడటం లేదు. నిత్య అసమ్మతివాదిగా పాపులరైన ఈ ఎస్సీ నేత టిడిపిలోనే ఉంటూ టిఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడేవారు. ఇపుడు జరుగుతున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ తొ పొత్తుపెట్టుకునో లేకపోతే విలీనం చేసేయాలని చంద్రబాబును మోత్కుపల్లి ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. అనేక సమావేశాల్లోనే కాకుండా మీడియాలో కూడా డిమాండ్ చేయటంతో చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. అయితే, మోత్కుపల్లి డిమాండ్ పై చంద్రబాబు ఎంతకీ స్పందించలేదనుకోండి అది వేరే సంగతి.

 

చివరకు మోత్కుపల్లి తలనొప్పులు ఎక్కువైపోవటంతో వేరేదారి లేక ఆయన్ను చంద్రబాబు పార్టీ నుండి బహిష్కరించారు. అప్పటి నుండి చంద్రబాబుపై మరింతగా రెచ్చిపోయిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి తాను టిడిపి నుండి బయటపడగానే మిగిలిన పార్టీలు తనను నెత్తిన పెట్టుకుంటాయని భావించారు. అంతే తన గురించి తాను చాలా ఓవర్ గా అంచనా వేసుకున్నారనే చెప్పాలి. కానీ ఏ పార్టీ కూడా మోత్కుపల్లిని ఏమాత్రం పట్టించుకోలేదు. తెలుగుదేశంపార్టీలో ఉన్నంత కాలం ఏ టిఆర్ఎస్ తరపునైతే వాదిస్తున్నారో చివరకు టిఆర్ఎస్ చీఫ్ కెసియార్ కూడా మోత్కుపల్లిని ఏమాత్రం ఖాతరు చేయలేదు. దాంతో మోత్కుపల్లి షాక్ కు గురయ్యారు. చివరకు చేసేది లేక బిఎల్ఎఫ్ అభ్యర్ధిగా రంగంలోకి దిగటంతో ఒత్తిడికి గురయ్యారనే చెప్పాలి. చివరకు మోత్కుపల్లికి ఏమవుతుందో అని కుటుంబసభ్యులు ఆందోళన పడుతున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: