తెలంగాణాలో పోలింగ్ బాగా జరుగుతోంది. ముఖ్యంగా పల్లెల్లో జనం బారులు తీరి మరీ ఓటేసేందుకు పోటెత్తుతున్నారు. గతంతో పోలిస్తే ఇది మంచి పరిణామంగా చెబుతున్నారు. మధ్యాహ్నానికే హాఫ్ సెంచరీ పోలింగ్ జరగడం విశేషం. ఇంకా మూడు గంటల సమయం ఉంది. దాంతో ఈసారి పోలింగ్ 80 శాతానికి పై దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


రెండు శిబిరాల్లో ధీమా:


పెరిగిన పోలింగ్ పై అపుడే అంచనాలు మొదలయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో 50 నుంచి 51శాతం వరకు పోలింగ్ నమోదైంది. ఇదే రోజు ఓటింగ్ జరుగుతున్న రాజస్థాన్ లో కేవలం 41శాతం మాత్రమే నమోదవడం గమనార్హం. పోలింగ్ శాతం పెరిగే ప్రతిపక్షానికి అనుకూలమని.. తగ్గితే అధికార పక్షానికి అనుకూలమనే వాదన వినపడుతోంది. అయితే ఇది టీయారెస్ ప్రభంజనమని ముఖ్యమంత్రి కేసీయార్ చెప్పుకొచ్చారు. అంతటా మళ్ళీ తమకే అనుకూలంగా గాలి ఉందని అంటున్నారు. మరో వైపు ప్రజా కూటమికి ఇది అనుకూల సంకేతమని కూటమి నేతలు అంటున్నారు.


అక్కడ తగ్గిపోయింది :

అయితే హైదరాబాద్ లో ఓటింగ్ పర్సేంటేజీ తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో పోలింగ్ కారణంగా 6 నుంచి 9వరకు వరుస సెలవులు వచ్చాయి. ఈ కారణంగానే హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు టూర్లకు వెళ్లినట్టు అర్థమవుతోంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఆశావాహంగా పోలింగ్ నమోదైనా హైదరాబాద్ లో మాత్రం తగ్గిపోయిందని అంటున్నారు. మరి దీని మీద కూడా ఓ రకమైన చర్చ సాగుతోంది. ఇక్కడ మజ్లిస్ పార్టీ గెలుస్తుందని, మిగిలిన చోట్ల మాత్రం హోరా హోరీ తప్పేట్లు లేదన్న మాట ఉంది. 
కాగా అయితే 1 గంట వరకు 49శాతం తెలంగాణ వ్యాప్తంగా నమోదైన దృష్ట్యా సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 80శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలంగాణ ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే జరిగితే తెలంగాణ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైనట్టే లెక్కా.. మరి చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: