పోలింగ్ పర్సంటేజ్ పెరిగేకొద్దీ అధికార టిఆర్ఎస్ లో టెన్షన్ పెరిగిపోతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్రవ్యాప్తంగా 47.8 శాతం సగటు పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్లను అనుమతిస్తారు. అంటే క్యూలో ఎంతమందుంటే అంతమందినీ ఓటింగ్ కు అనుమతిస్తారు. కాబట్టి పోయిన ఎన్నికల్లో నమోదైన 68.5 శాతం పోలింగ్ ను దాటే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి ట్రెండ్ ను చూస్తుంటే పోల్ పర్సంటేజ్ సుమారుగా 72 దాకా చేరుకుంటుందనే అనిపిస్తోంది. ఇక్కడే టిఆర్ఎస్ లో టెన్షన్ పెరిగిపోతోంది.

 

ఎన్నికల సర్వేల్లో ఆంధ్రా ఆక్టోపస్ గా పాపులరైన లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ, పోయిన ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతం గనుక దాటితే తెలంగాణాలో మహాకూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పటం అందరికీ తెలిసిందే. ఒకవేళ పోలింగ్ శాతం పోయిన ఎన్నికల్లో కన్నా గనుక తగ్గితే హంగ్ వస్తుందని కూడా చెప్పారు. అంటే ఏ రకంగా చూసినా లగడపాటి జోస్యం ప్రకారం టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. లగడపాటి జోస్యం ఎంత వరకూ నిజమవుతుందో చెప్పటం కష్టమే కానీ మొత్తం మీద ఆ జోస్యం కెసియార్ అండ్ కో ను బాగా ఇబ్బంది పెట్టిందన్నది మాత్రం వాస్తవం.

 

లగడపాటి జోస్యం విషయం మీదే దృష్టి పెట్టిన అందరూ పొద్దున్నుండి పోలింగ్ పర్సంటేజ్ పైనే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దానికితోడు ఓటర్లు కూడా పొద్దుట నుండే పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. తెలంగాణా వ్యాప్తంగా ఉదయం నుండే క్యూల్లో ఓటర్లు కనబడేటప్పటికి ఓటింగ్ పర్సంటేజ్ పెరగటం ఖాయమని అంచనాలు వేసుకుంటున్నారు. ఉదయం నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారంటే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే కారణమని ఎవరికి వారుగా అంచనాలు వేసుకుంటున్నారు. అదే సమయంలో తమ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే ఓట్లు వేస్తున్నారంటూ టిఆర్ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: