ఎన్నికల పోలింగ్ సందడి ముగిసింది. 119 నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. మళ్లీ 11న బాక్సులు విప్పేవరకూ అభ్యర్థులకు టెన్షన్ తప్పదు. ఈలోగా ఎగ్జిట్ పోల్స్ ఎవరు గెలుస్తారో మేం చెప్పేస్తాంగా అంటూ విడుదలయ్యాయి. తెలంగాణ వరకూ మళ్లీ టీఆర్ ఎస్ పార్టీయే సొంతంగా అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పేశాయి. లగడపాటి రాజగోపాల్ సర్వే తప్ప ఏ ఒక్క సర్వే కూడా ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని చెప్పకపోవడం విశేషం.



టైమ్స్ నౌ సర్వే 66 స్థానాలు గెలుచుకుని టీఆర్ఎస్ మళ్లీ అధికారం చేజిక్కించుకుంటుందని జోస్యం చెప్పింది. నాలుగు పార్టీల ప్రజాకూటమికి 37 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక బీజేపీ పాత రికార్డును మెరుగుపరుచుకుని 7 స్థానాలు దక్కించుకోనుంది. ఎంఐఎంతో పాటు ఇతరులు మొత్తం 9 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని టైమ్స్ నౌ చెప్పింది.



ఇక న్యూస్ 18 సంస్థ... టీఆర్ఎస్ పార్టీ 50 నుంచి 65 స్థానాలు గెలుచుకోవచ్చని అంచనా వేసింది. ప్రజాకూటమికి 38 నుంచి 52 స్థానాలు వస్తాయని తెలిపింది. బీజేపీకి 4 నుంచి 7 సీట్లు రావచ్చు. ఐతే.. ఇతరులు పెద్ద సంఖ్యలో 8 నుంచి 14 సీట్లు వరకూ గెలుచుకోవచ్చని ఈ సర్వే చెప్పడం విశేషO.



టీఆర్ఎస్ 79 నుంచి 91 సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే సర్వే చెప్పడం విశేషం. వీళ్ల సర్వే ప్రకారం గులాబీ పార్టీ స్వీప్ చేస్తుందన్నమాట. ప్రజా కూటమికి కేవలం 21 నుంచి 33 సీట్లు మాత్రమే వస్తాయని ఈ సర్వే తేల్చి చెప్పింది.


ఇక ఆరా మీడియా అనే మరో సంస్థ.. 75 నుంచి 85 సీట్లు గెలుచుకుని మరోసారి టీఆర్ఎస్ జయకేతనం ఎగరేయబోతోందని ఢంకా భజాయించింది. ఈ సంస్థ ఎగ్జిట్ పోల్ ప్రకారం ప్రజాకూటమికి 25 నుంచి 35 స్థానాలు మాత్రమే వస్తాయట. బీజేపీకి 2 లేదా 3 సీట్లు మాత్రమే దక్కించుకోనుంది. ఎంఐఎం 7-8 స్థానాలు.. ఇతరులు 3 వరకూ గెలుచుకునే ఛాన్స్ ఉందట. మొత్తానికి అన్నిసర్వేలూ టీఆర్‌ఎస్ దే విజయం అని చెప్పడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: