అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన లగడపాటి రాజగోపాల్ సర్వే ఊహించినట్టే వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ కలసి ఏర్పాటైన ప్రజాకూటమి 65 స్థానాల్లో గెలవబోతోందని లగడపాటి ఢంకా భజాయించారు. ఈ విషయం మొన్ననే చెప్పినా.. ఇప్పుడు గణాంకాలతో సహా చెప్పడంతో అందరిలో ఉత్కంఠకు తెరపడింది.



ఇక అధికార టీఆర్‌ఎస్ పార్టీ 25 నుంచి 45 వరకూ స్థానాలు దక్కించుకుని.. అధికారం కోల్పోవడం ఖాయమని లగడపాటి సర్వే చెప్పింది. ప్రజాకూటమి విషయానికి వస్తే టీడీపీకి 5 నుంచి 7 సీట్లు వస్తాయని లగడపాటి అంచనా వేశారుఎంఐఎం పార్టీ 6 వరకూ సీట్లు... భాజపా 7 సీట్లు, స్వతంత్రులు మరో 7 స్థానాల్లో గెలుస్తారని లగడపాటి తెలిపారు.



ప్రజాకూటమి, టీఆర్ఎస్ గెలిచే సీట్ల విషయంలో ప్లస్ ఆర్ మైనస్ 10 సీట్లు ఉండొచ్చని లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ఐతే.. జాతీయ ఛానల్స్ అన్నీ కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పిన నేపథ్యంలో లగడపాటి సర్వే విశ్వసనీయతపై అనుమానాలు తలెత్తాయి. విలేకర్లు ఈ విషయంపై ప్రశ్నించినప్పుడు.. తనకు దక్షిణ భారతంపై ఉన్న పట్టు జాతీయ ఛానల్స్ కు ఉందని లగడపాటి తెలిపారు.



ఈ విషయం ఇప్పటికే గత కర్ణాటక, తమిళనాడు ఎన్నికల్లో తేలిందని చెప్పారు. అప్పుడు కూడా తానొక్కడినే వాస్తవ ఫలితాలకు దగ్గరగా చెప్పానని లగడపాటి చెప్పారు. ఈ ఎన్నికల్లో సర్వే చాలా కష్టంగా మారిందని.. చివరి నిమిషం వరకూ ప్రలోభాలు పెద్ద ఎత్తున సాగాయని లగడపాటి చెప్పారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ కూడా ఫలితాలపై ప్రభావం చూపిందని లగడపాటి రాజగోపాల్ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: