తెలంగాణలో అధికారం మళ్లీ టీఆర్ఎస్ దేనని ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కోడైకూస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలూ టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాయి. ఒక్క లగడపాటి మాత్రం కాంగ్రెస్ కూటమిదే అధికారమని తేల్చేశారు. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఏది నిజమవుతుందో.. ఏది అబద్దమో.. 11వ తేదీన తేలనుంది.. 
తెలంగాణ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగియగా, ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ హడావిడి చేశాయి.. జాతీయ ఛానెళ్లతోపాటు పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వివరాలను బయటపెట్టాయి.. టీఆర్ఎస్ విజయం సాధించబోతున్నదని ఎగ్జిట్స్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.


తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 60 స్థానాల్లో గెలవాలి. అయితే, టీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ దాటేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.. సీఎన్ఎన్ న్యూస్ 18 చేపట్టిన సర్వే ప్రకారం తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ అధికారం చేపడుతుందనే అంచనాలు కనిపిస్తున్నాయి. మొత్తం 119 స్థానాలకు గాను టీఆర్ఎస్కు 50 నుంచి 65 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. అలాగే, టీఆర్ఎస్కు మొదటి నుంచి గట్టి పోటీ ఇచ్చిన ప్రజాకూటమికి 38 నుంచి 52 సీట్లు రానున్నట్టు పేర్కొంది. బీజేపీకి 4 నుంచి ఏడు స్థానాలు వస్తాయని, ఇతరులకు 8 నుంచి 14 స్థానాలు వస్తాయని పేర్కొంది.


ఇక ఇండియా టుడే నిర్వహించిన సర్వే ప్రకారం టీఆర్ఎస్ పవర్ లోకి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ ఈసారి 79 నుంచి 91 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వే వెల్లడిస్తోంది. ప్రజా కూటమి 21 నుంచి 33 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని చెబుతోంది. ఇక బీజేపీ ఒకటి నుంచి మూడు సీట్లలో మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయని ఇండియా టుడే సర్వే రిపోర్ట్ చెబుతోంది. ఎంఐఎం నాలుగు నుంచి ఏడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందంటోంది.


మరోవైపు టైమ్స్ నౌ-సీఎన్ఎక్స్ సర్వే కూడా టీఆర్ఎస్కు అనుకూలంగా సర్వే ఇచ్చింది. ఇక అధికార పార్టీ టీఆర్ఎస్కు 66 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్కు 37 స్థానాలు, బీజేపీకి ఏడు స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీయే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. టీఆర్ఎస్కు 50 - 65 సీట్లు వస్తాయని.. ప్రజాకూటమికి 38-52 స్థానాలు, బీజేపీకి 4-7, ఇతరులు 10 - 17 స్థానాల్లో గెలవనున్నారని ఎగ్జిపోల్స్ ఫలితాలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: