తెలంగాణా ఎన్నిక‌లు ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తించాయ‌న‌డంలో సందేహం లేదు. ఆది నుంచి కూడా ఎన్నిక‌ల స‌ర‌ళి.. ఆసక్తిగా మారింది. నెమ్మ‌దిగా మొద‌లై.. మ‌ధ్య‌లో పుంజుకుని చివ‌ర‌కు ప్ర‌శాంతంగా ముగిసింది. ఈ మొత్తం ఎన్నిక‌ల్లో అంద‌రినీ అంటే అటు తెలంగాణా, ఇటు ఏపీప్ర‌జ‌ల‌ను సైతం ఆక‌ర్షించిన నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్‌. వికారాబాద్ జిల్లాలోని కీల‌క‌మైన ఈ నియోజ‌క‌వ‌ర్గంపై అంద‌రి దృష్టీ ప‌డింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఇక్క‌డ నుంచి పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండ‌డమే. అంతేకాకుండా ఎన్నిక‌ల‌కు కేవ‌లం రెండు రోజుల ముందు కొడంగ‌ల్‌లో జ‌రిగిన ప‌రిణామాలు కూడా తీవ్ర స్థాయిలో ఉత్కంఠ‌ను రేపాయి. 

దీంతో ఇక్క‌డ ఎన్నిక‌ల స‌ర‌ళి నుంచి ముగించే వ‌ర‌కు కూడా చాలా ఆస‌క్తిగా మారింది. అధికార టీఆర్ ఎస్‌తో ఆది నుంచి కూడా తీవ్ర‌స్తాయిలో పోటీ ప‌డుతున్న నాయ‌కుడు రేవంత్‌. గ‌తంలో టీడీపీలో ఉండ‌గా, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వ‌చ్చినా ఆయ‌న టార్గెట్ నేరుగా కేసీఆర్‌. ఈ నేప‌థ్యంలో కొడంగ‌ల్ ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేయ‌డం ద్వారా త‌న‌ను తాను మ‌రోసారి నిరూపించుకునేందుకు రేవంత్ తీవ్రంగా శ్ర‌మించారు. ఇక‌, తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల విష‌యంలో కొడంగ‌ల్‌లోనూ ఆశించిన మేర‌కు పోలింగ్ న‌మోదు కాలేదు. కేవలం 54%తో ఓట‌ర్లు స‌రిపెట్టారు. ఈ క్ర‌మంలో ఇక్క‌డ నిల‌బ‌డ్డ టీఆర్ ఎస్ అభ్య‌ర్థి ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డి ఆశ‌లు గ‌ల్లంతేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు.


 ఓటింగ్ ఎక్కువ‌గాజ‌రిగి ఉంటే.. ప‌ట్నం ఆశ‌లు పెరిగి ఉండేవ‌ని, అయితే, సంప్ర‌దాయ ఓట‌ర్లు మ‌త్ర‌మే మ‌ళ్లీ పోలింగ్ కేంద్రాల‌కు క్యూ క‌ట్ట‌డంతో ఈ ఓటింగ్ మొత్తం రేవంత్‌కు అనుకూల‌మ‌నే వ్యాఖ్య‌లు జోరందుకున్నాయి. అదేస‌మ‌యంలో యువ‌త కూడా భారీ ఎత్తున పోటెత్తారు. వీరి ఓట్లు కూడా రేవంత్‌కు అనుకూలంగా ప‌డ‌తాయ‌ని అంటారు. మొత్తంగా చూస్తే.. రేవంత్ విజ‌యం గ్యారెంటీనే అయినా.. మెజారిటీ పై మాత్రం ప్ర‌భావం చూపించ‌లేక‌పోయార‌నేది సారాంశం. మ‌రోప‌క్క‌, త‌న‌పై ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌బుత్వం, పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరుతో సెంటిమెంట్ పెరుగుతుంద‌ని భావించిన రేవంత్‌కు ఆ మేర‌కు ఊర‌ట ల‌భించ‌క‌పోవ‌డం కూడా చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: