తెలంగాణా ఉద్య‌మ సార‌ధి, తొలి ముఖ్య‌మంత్రి, ప్ర‌జానాయ‌కుడు, ఉద్య‌మ గ‌ళం.. క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు.. ఉర‌ఫ్ కేసీఆర్ చుట్టూ. ఇప్పుడు తాజాగా జ‌రిగిన తెలంగాణా ఎన్నిక‌లు గింగిరాలు చుడుతున్నాయి. ఆయ‌న పార్టీ టీఆర్ ఎస్ తిరిగి అధికారంలోకి రాద‌ని ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ వంటి వారు తీర్మానం చేశారు. అంతేకాదు,జాతీయ ఎగ్జిట్ పోల్ స‌ర్వేల్లో కేసీఆర్‌కు అనుకూలంగా ఉంద‌ని తెలిసిన త‌ర్వాత కూడా రాజగోపాల్ ఒక్క అడుగు కూడా వెన‌క్కి వేయ‌లేదు దీంతో కేసీఆర్ పార్టీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇక‌, ఇప్పుడు మ‌రికొంద‌రు మ‌రో అడుగు ముందుకు వేసి.. కేసీఆర్ గెలుస్తాడా? ఆయ‌న కూడా ఓడిపోతాడా? అంటూ కూనిరాగాలు తీస్తున్నారు. 


సిద్దిపేట జిల్లా గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగిన కేసీఆర్ ఈ ద‌ఫా ఓడిపోతున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. కేసీఆర్‌కే దిక్కులేదు.,. ఆయ‌న ఓట‌మి ఖాయం అంటూ విప‌రీత ప్ర‌చారం సాగింది. దీంతో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఎక్కువ మంది దృష్టి కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఓటింగ్‌పైనే సాగడం విశేషం. ఇక‌, ఇక్క‌డ నుంచి బ‌రిలో నిలిచిన మ‌హాకూట‌మి అబ్య‌ర్థి కూడా పెద్ద ఎత్తున తాను గెలువ‌నున్న‌ట్టు ప్ర‌చారం చేసుకున్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌పై 50 వేల మెజార్టీతో తాను గెలవబోతున్నానని ప్రజాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని చంపేశారని విమర్శించారు. 


నిజమైన స్వాతంత్రం ఈ నెల 11న వస్తుందని అన్నారు. నాలుగేళ్లలో కేసీఆర్ తెలంగాణను నాశనం చేశారని ఆరోపించా రు. నాలుగేళ్లుగా మూతపడ్డ సెక్రటేరియట్‌ను మళ్లీ తెరిపిస్తామన్నారు. గజ్వేల్ ప్రజలు చైతన్య వంతులని, నిజమైన ప్రజాస్వామ్యానికే ఓటు వేశారని చెప్పారు. ఈ నాలుగేళ్లలో దోచుకున్న వారి భరతం పడతామని వంటేరు ప్రతాప్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక‌, ఇదే విష‌యంపై వ్యాఖ్యానించిన ల‌గ‌డ‌పాటి కూడా త‌న‌దైన శైలిలో ముక్తాయింపునిచ్చారు. గ‌జ్వేల్‌లో కేసీఆర్ ఓడిపోతారా? అన్న ప్ర‌శ్న‌కు ఆయ‌న లేద‌ని కానీ, ఔన‌ని కానీ స‌మాధానం చెప్ప‌కుండా దీనిపై ఎగ్జిట్ పోల్‌ను మీకే వ‌దిలేస్తున్నాను.. అంటూ వ్యాఖ్యానించ‌డం ద్వారా ఇక్క‌డ ఏదో జ‌ర‌గ‌బోతోంద‌నే స‌స్పెన్స్‌కు ఆయ‌న తెర‌దీశారు. మొత్తంగా చూస్తే., కేసీఆర్ గెలుస్తార‌ని ఎక్కువ మంది అంటుంటే.. మ‌హాకూట‌మి నాయ‌కులు మాత్రం కేసీఆర్ ఓట‌మి ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఏదేమైనా.. మంగ‌ళవారం విడుద‌ల‌య్యే ఫ‌లితాల వ‌ర‌కు ఈ ఉత్కంఠ వీడ‌దు!


మరింత సమాచారం తెలుసుకోండి: