తెలంగాణాలో ఎవరు గెలుస్తున్నారు. ఇపుడు ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. పోలింగ్ ముగిసింది, జనం ఓటు ఈవీఎంలలో భద్రంగా ఉంది కానీ పోటీ చేసిన అభ్యర్ధుల్లో మాత్రం హై టెన్షన్ పట్టుకుంది. నిజానికి గడచిన మూడు నెలలుగా తెలంగాణాలోని  రాజకీయ నాయకులు ఆరోగ్యాలను సైతం లెక్కలోకి తీసుకోకుండా ప్రచారం పేరిట వీధుల్లోనే ఉంటూ వచ్చారు. పోనీ ఇపుడు స్థిమితపడదామా అంటే సర్వేల హైరానా గంగవెర్రులెత్తిస్తోంది.


క్షణం ఒక యుగం:


తెలంగాణాలో ఎన్నికలు జరిగిపోయాయి. ఫలితాలు రావడానికి అచ్చంగా నలభై ఎనిమిది గంటల వ్యవధి మాత్రమే ఉంది. క్షణం ఒక యుగంగా గడుస్తోంది కాలం అంటున్నారు అభ్యర్ధులు. ఇక పార్టీలకూ బేజారుగానే ఉంది. ఎవరికి జనం ఓటేసారో తెలియని అయోమయం. తెలంగాణా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా  74 శాతం మేర పోలింగ్ జరిగింది. పల్లెల్లో ఎనభై శాతం, తొంబై శాతం పోలింగ్ నమోదు అవడం రికార్డ్. ఊళ్ళకు ఊళ్ళు కదిలి ఓటెత్తింది ప్రేమతోనా. కసి తోనా ఇదే ఇపుడు పార్టీలను వేధిస్తోంది.


కొత్త ఓటర్లు ఎటు వైపు:


తెలంగాణా ఎన్నికల్లో కొత్త ఓటర్లు దాదాపుగా ఏడున్నర లక్షల మంది ఉన్నారు. వారంతా ఎటు వైపు అన్న లెక్కలు కూడా ఇపుడు పార్టీలు వేసుకుంటున్నారు. తొలిసారి ఓటు, అందులోనూ యువత మరి వారు సహజంగానే మార్పు కోరుకుంటే ప్రస్తుత ప్రభుత్వానికి అది నెగిటివ్ ఓటుగానే చూడాలి. పాత ఓటు సానుకూలంగా కొంత ఉన్నా కొత్త ఓటు వచ్చి ధీమాను చెడగొడుతోందేనని అధికార పార్టీ నాయ‌కులు కంగారు పడుతున్నారు.


డబ్బు ప్రభావం :


వీటన్నిటికీ తోడు ఈసారి డబ్బు ప్రభావం కూడా ఎన్నికల్లో బాగానే ఉందంటున్నారు. ఒక్కో చోట ఓటుకు అయిదు వేల రూపాయలు కూడా ఇచ్చారని చెప్పుకుంటున్నారంటే ఎంత ఖరీదైన ఎన్నిక అయిపోయిందనిపిస్తోంది మరి డబ్బులు తీసుకునే ఓట్లు వేసేందుకు జనం అంత పెద్ద ఎత్తున క్యూ కట్టారా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. అదే జరిగితే ఆ ధన ప్రభావం ఏ వైపు నుంచి ఎక్కువగా ఉంది. ఎవరు నడిపించగలరన్నది కూడా మరో చర్చకు వస్తోంది.

 ఇక ఈ ఎన్నికలు ఎందుకు జరిగాయో ఎవరికీ తెలియదు, ముందస్తు ఎన్నికలకు ఒక నినాదం అంటూ లేదు. అంటే వేవ్ లేదు. వేవ్ లేని చోట సహజంగానే అధికార పార్టీకి ప్లస్ అవుతుంది. అదే ఇపుడు టీయారెస్ లో ధీమా పెంచుతోంది. మరో వైపు కూటమి కట్టి చంద్రబాబు, రాహుల్ కలయికతో సరికొత్త వంటకం వండారు అది ఏమైన ఓటర్లను ఆకట్టుకుందా అన్న అనుమానాలూ ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే తెలంగాణా ఓటరు ఈసారి గడుసుగానే ఓటేశాడనిపిస్తోంది. అనూహ్యమైన తీర్పు రాబోతోందని కూడా అంటున్నారు. వేచి చూడాలి మరో నలభై ఎనిమిది గంటలు.


మరింత సమాచారం తెలుసుకోండి: