ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు రాజ‌కీయంగా చాలానే ఆశ ఉంది. ఒక‌ప‌క్క జ‌న‌సేనాని ప‌వ‌న్ వంటి వారు.. బాబుకు వృద్దాప్యం వ‌చ్చింది విశ్రాంతి ఇద్దాం అని పిలుపు ఇస్తుంటే.. చంద్ర‌బాబు మాత్రం తాను చెంగుచెంగున ఎగురుతాన‌ని ప్ర‌క‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఏపీలో ఉన్న ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు. అదేస‌మ‌యంలో రెండు రోజుల కింద‌ట ముగిసిన తెలంగాణా ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న చ‌క్రం తిప్పారు. ఇక‌, ఇప్పుడు ఏకంగా మ‌రో పొరుగు రాష్ట్రం. అదికూడా తెలుగేత‌ర రాష్ట్రం ఒడిసాలో బాబు చ‌క్రం తిప్పేందుకు రెడీ అయ్యారు. టీడీపీ జాతీయ అధ్య‌క్షుడిగా ఉన్న చంద్ర‌బాబు.. ఒడిశాలోనూ టీడీపీని ప‌రుగులు పెట్టించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 


ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో తెలుగువారు ఎక్కువగా ఉండటంతో  తెలుగుతమ్ముళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో.. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టీడీపీ పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 50 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు ఒడిశా టీడీపీ అధ్యక్షుడు రాజేశ్ పుత్ర తెలిపారు.  కోరాపుట్, నబరంగ్ పూర్, బెహ్రమ్ పూర్, అస్కా లోక్‌సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. కాగా.. కోరాపుట్, రాయగడ, మల్కన్ గిరి, గజపతి, గంజాం, నబరంగ్ పూర్ జిల్లాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అయితే అభ్యర్థులెవరన్న విషయంపై త్వరలోనే సీఎం చంద్రబాబుతో చర్చిస్తామన్నారు. 

Image result for tdp leader rajesh putra

ఎవరు ఎక్కడ్నుంచి పోటీ చేస్తారు..? ఎంపీ సీటు ఎవరికివ్వాలి అనే విషయాలపై త్వరలోనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారని రాజేశ్ స్పష్టం చేశారు. టీడీపీ పోటీ చేయడం వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని బీజేడీ తేల్చేసింది. మరోవైపు కాంగ్రెస్ స్పందిస్తూ టీడీపీ వల్ల కచ్చితంగా బీజేడీ ఓట్లు చీలుతాయని తద్వారా తమ పార్టీకి లాభం చేకూరుతుందని వ్యాఖ్యానించింది. తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ టీడీపీ ఉంటుందని.. తెలుగు తమ్ముళ్లు అప్పుడప్పుడూ బహిరంగ సభల్లో చెబుతుంటారు.  


ఇలా ఒడిశాలో టీడీపీ పోటీ చేయడం వల్ల.. జాతీయస్థాయిలో చక్రం తిప్పుతానన్న చంద్రబాబుకు ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మ‌రి బాబు గారి దూకుడు ఇక్క‌డితో ఆగుతుందో లేక‌.,. మ‌రిన్ని రాష్ట్రాల‌కు విస్త‌రిస్తుందో చూడాలి. మ‌న‌లో మ‌న మాట‌.. ప‌క్క‌రాష్ట్రం.. చంద్ర‌బాబు చ‌క్రం తిప్పిన రాష్ట్రంలోనే 12 స్తానాల‌కు ప‌రిమిత‌మైన బాబు. ఒడిసాలో చ‌క్రం తిప్పి ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలోనే గెలిచేందుకు బాబు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్న టైంలో బాబు ఒడిశాలో ఏం చేస్తాడో ?  



మరింత సమాచారం తెలుసుకోండి: