తెలంగాణ ఎన్నికలు ముగిసాయి. రెండు తెలుగురాష్ట్రాల ప్రజలు కళ్లలో ఒత్తులు వేసుకుని మంగళవారం ఉదయం 8 గంటలు ఎప్పుడు అవుతుందా ? అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు ముగిశాక పలు జాతీయ సర్వే సంస్థలు, జాతీయ మీడియా అంతా తెలంగాణలో కేసీఆర్‌ మరో సారి అధికారంలోకి రాబోతున్నారని చెప్పడంతో పాటు టీఆర్‌ఎస్‌ 60 నుంచి 70 సీట్లు సాధిస్తుందని మరి కొందరూ, టీఆర్‌ఎస్‌కు 90 సీట్లు అయినా వస్తాయని మరి కొన్ని సంస్థలు స్పష్టం చేశాయి. ఇక ఆంధ్రా ఆక్టోపస్‌గా ఎన్నికల ఫలితాలను అంచనా వెయ్యడంలో తిరుగులేని వ్యక్తిగా పేరున్న విజ‌య‌వాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మాత్రం తెలంగాణ జనం నాడి హస్తం వైపే మొగ్గు చూపిందని తేల్చేసారు. 2005 నుంచి రాజగోపాల్‌ చేసిన సర్వేలన్నీ నూటికి నూరు శాతం కరెక్ట్ అవ్వడంతో రాజగోపాల్‌ సర్వేకు సైతం మంచి క్రేజ్‌ ఉంది. 


ఎన్నికలు ముగిసాక కూడా రాజగోపాల్‌ కూటమికి మొగ్గు స్పష్టంగా ఉందని తెలంగాణలో టీఆర్‌ఎస్‌ బలంగా ఉన్న వరంగల్‌ లాంటి జిల్లాలో సైతం కూటమికి ఆధిక్యత వస్తుందని ఆయన చెప్పారు. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న మెజారిటీ వర్గాల అంచనా ప్రకారం అటు టీఆర్‌ఎస్‌కు పూర్తి మెజారిటీ రాదు ఇటు ప్రజాకూటమికి మెజారిటీ రాకపోవచ్చని అంటున్నారు. ఈ క్రమంలోనే ఎంఐఎం, బీజేపీతో పాటు తెలంగాణలో ఆరేడు చోట్ల గెలుస్తారని భావిస్తున్న స్వతంత్రులు సైతం ప్రభుత్వం ఏర్పాటులో కీలకం కానున్నారు.  హంగ్‌ వస్తే ఇటు ప్రజాకూటమి అయినా అటు టీఆర్‌ఎస్‌ అయినా స్వతంత్రులపై ఆధారపడక తప్పని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌కు ఇటు ప్రజాకూటమికి అధికారం అనేది త్రిశంకు స్వర్గంలా మారే పరిస్థితి ఉంది. 


టీఆర్‌ఎస్‌కు ఎలాగో ఎంఐఎం బహిరంగంగానే అండగా ఉంటామని ప్రకటించింది. అలాగే బీజేపీ సైతం ఇంటర్‌నల్‌గా టీఆర్‌ఎస్‌కి సపోర్ట్‌ చేస్తుందన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఇక ఇప్పుడు తెలంగాణలో గెలిచే ఐదారుగురు స్వతంత్రులపై వల వేసేందుకు అటు టీఆర్‌ఎస్‌తో పాటు ఇటు ప్రజాకూటమి నేతలు సైతం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని వైరా, అదిలాబాద్‌ జిల్లాలోని బెల్లంపల్లి, బోథ్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నారాయణపేట, రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, కరింనగర్‌ జిల్లాలోని వేములవాడ, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మక్తల్‌ లాంటి చోట్ల స్వతంత్రులు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు వారు గెలుస్తారన్న అంచనాలు బలంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే హంగ్‌ వస్తే ప్రభత్వ ఏర్పాట్లు వీరే కీలకం కానుండడంతో వీరిని తమ వైపుకు తిప్పుకునేందుకు అటు టీఆర్‌ఎస్‌, ఇటు ప్రజాకూటమి నాయకులు బేరసారాలకు రెడీ అయినట్టు తెలుస్తోంది. 


కరీంనగర్‌ జిల్లాలో గెలుస్తాడని అంచనాలో ఉన్న ఓ రెబల్‌తో మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే మాట్లాడగా అలాగే ప్రజాకూటమి నుంచి ఉత్తమకుమార్‌ రెడ్డి సైతం తన అనుచరుల ద్వారా ఆ ఇండిపెండెంట్‌ అభ్యర్థికి ఫోన్‌ చేయించినట్టు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో గెలుస్తాడని అంచనాలో ఉన్న ఓ ఇండిపెండెంట్‌ డీకే. అరుణకు సమీప బంధువు కావడంతో ఆమె కూడా తన వంతుగా ఆయన్ను కూటమి వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులను తమ వైపునకు తిప్పుకునేందుకు టీఆర్‌ఎస్‌ భారీ ఆఫర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్‌ కొంతమంది ఇండిపెండెంట్లతో నేరుగా మాట్లాడగా... కేసీఆర్‌ సూచన మెరకు పార్టీ కీలక నేతలు సైతం ఇండీపెండెంట్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నట్టు తెలిసింది. అదే టైమ్‌లో కూటమి సైతం తమ పార్టీ టిక్కెట్లు రాకా రెబల్‌గా పోటీ చేసిన వాళ్లని తమ వైపునకు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. కూట‌మి మీరు పెట్టిన ఎన్నిక‌ల ఖ‌ర్చంతా మేం ఇస్తామ‌ని చెపుతోంద‌ట‌. మరి ఎన్నికల ఫలితాలు వచ్చాక ఇండిపెండెంట్ల పరిస్థితి ఎలా ఉంటుందో చాడాల్సి ఉంది.
ReplyForward


మరింత సమాచారం తెలుసుకోండి: