తెలంగాణలో ఎంతో ఉత్కంఠంగా కొనసాగింది పోలింగ్.  గత నెల నుంచి ఎన్నిల ప్రచారం జోరుగా సాగింది..పార్టీ ముఖ్య నేతలు ప్రచారాలతో దుమ్మురేపారు.  మొత్తానికి మొన్న 7వ తారీఖు తెలంగాణలో పోలింగ్ పూర్తయ్యింది.  ఇక ముఖ్యపార్టీలైన టీఆర్ఎస్, మహాకూటమి గెలుపు మాదంటే మాదంటూ స్పీచ్ లు ఇస్తున్నారు.  రేపటితో ఎవరు గెలుస్తారో..ఎవరు ఓడుతారో..హంగ్ ఏర్పడుతుందా లేదా మెజార్టీతో గెలుపు కైవసం అవుతుందా తెలిసిపోతుంది.  తాజాగా తెలంగాణ ఎన్నికల్లో ప్రజా కూటమి గెలుపును సోనియా గాంధీకి పుట్టినరోజు కానుకగా ఇస్తామని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 11న ప్రజాకూటమి గెలవబోతోందని, గెలుపును ఆస్వాదించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు రాబోతోందని అన్నారు.  ఈ సందర్బంగా ఆయన కేసీఆర్ పై మరోసారి మండ పడ్డారు.  కేసీఆర్ కి తెలంగాణలోని రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉందని.. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  ఎర్రవల్లి, చింతమడక గ్రామాల్లో కేసీఆర్ ఓటు హక్కు నమోదు చేసుకున్నారని, రెండు ప్రాంతాల్లో ఆయన ఎలా నమోదు చేసుకుంటారని ప్రశ్నించారు.

దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని, కేసీఆర్ తప్పిదానికి ఏడాది వరకు జైలు శిక్ష పడుతుందని అన్నారు.తెలంగాణకు పట్టిన చీడ పీడలను వదిలించుకోవడానికి ప్రజలకు మంచి అవకాశం లభించిందని, విలక్షణమైన తీర్పు ఇవ్వనున్నారని, నాలుగు కోట్ల ప్రజలకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: