దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార పార్టీ అయిన కారు జోరు ముందు కూటమి కుదేల్‌ అయిపోయింది. తెలంగాణ కాంగ్రెస్‌లో మహామహులుగా ఉన్న డీకే. అరుణ, రేవంత్‌ రెడ్డి, దామోద‌ర్‌ రాజనరసింహా, జానారెడ్డి, కొమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మహామహులు సైతం తొలి రెండు మూడు రౌండ్లలో వెనకపడిపోయారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఎంతో ఆసక్తి రేపిన గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో సైతం కారు దూసుకుపోతుంది. 


ఇక్కడ నుంచి రెండు రౌండ్లు ముగిసేసరికి మహాకూటమి తరపున పోటీ చేసిన నందమూరి సుహాసినీపై టీఆర్‌ఎస్‌కు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 4,000 పైచెలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక కూకట్‌పల్లిలో పోస్టల్‌ బ్యాలెట్లలోనూ మాధవరందే పైచేయిగా నిలిచింది. పోస్టల్‌ బ్యాలెట్లలో మాధవరం కృష్ణారావుకు 400 ఓట్లు వస్తే నందమూరి సుహాసినీకి కేవలం 200 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏదేమైన ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్‌ బట్టీ చూస్తే కూకట్‌పల్లిలో సుహాసినీ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఐదు రౌండ్లు ముగిసే స‌రికి మాధ‌వ‌రంకు 9 వేల ఓట్ల ఆధిక్యం వ‌చ్చింది. ఇక సెటిలర్ల ఓట్లు అధికంగా ఉంటాయని భావించి కూకట్‌పల్లి నియోజకవర్గం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రబాబు ఇక్కడ నుంచి దివంగత మాజీ మంత్రి, తన బావమరిది అయిన దివంగత మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినీని రంగంలోకి దింపారు. 


సుహాసినీ గెలుపు కోసం బాబు సర్వ శక్తులు ఒడ్డారు. చంద్రబాబు సూచనల మెరకు ఏపీ నుంచి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు సైతం అక్కడ ప్రచారం చేశారు. అయితే తాజాగా వెల్లడవుతున్న ఫలితాల్లో మాత్రం సుహాసినీ పోటీ ఇచ్చే పరిస్థితి లేదని అర్థం అవుతోంది. ఏదేమైన కూకట్‌పల్లిలో సుహాసినీ ఓటమి చంద్రబాబుకు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: