రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు.. అనే ప‌రిణామానికి ఇప్పుడు తెలంగాణాలో వ‌చ్చిన ఫ‌లితం స్ప‌ష్టంగా చెబుతోంది. మ‌హా కూట‌మిగా ఏర్ప‌డిన కాంగ్రెస్‌-టీడీపీ నాయ‌కుల‌కు ప్ర‌జ‌లు గ‌ట్టిగానే జ‌వాబు చెప్పారు. అదే సమ‌యంలో పార్టీల‌కు ఓటు బ్యాంకులు కూడా కూసాలు క‌దిలిపోవ‌డం ఇప్పుడు తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ప్ర‌జ‌ల‌ను నివ్వెర పాటుకు గురి చేస్తున్న అంశం. కాంగ్రెస్‌కు ఆది నుంచి కూడా రెడ్డి సామాజిక వ‌ర్గం ఓటు బ్యాంకు పెద్ద భ‌రోసా. ఏ ఎన్నిక‌లైనా కూడా రెడ్డి ఓట్లు మొత్తం కాంగ్రెస్‌కు అనుకూలంగా ప‌డేవి. దీంతో కాంగ్రెస్ నాయ‌కులు ఎక్కువ‌గా రెడ్డి వ‌ర్గంపై పెద్ద‌గానే ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, తాజాగా తెలంగాణా ఫ‌లితాల్లో కాంగ్రెస్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది.


రెడ్డి సామాజిక వ‌ర్గానికి ఏదో కేసీఆర్ అన్యాయం చేస్తున్నాడ‌ని, మంత్రి ప‌ద‌వుల్లోకానీ, ఇత‌ర‌త్రా కానీ, పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని రెడ్డి వ‌ర్గాన్ని ఆయ‌న తొక్కేస్తున్నాడ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసిన కాంగ్రెస్ నిజానికి అప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ ప‌క్షాన ఉన్న రెడ్డి వ‌ర్గాన్ని సైతం త‌మ‌వైపు తిప్పుకొని గుండుగుత్తుగా కేసీఆర్‌ను ఓడించాల‌ని నిర్ణ‌యించుకుంది. అయితే, ఇది విక‌టించిన ప్ర‌యోగంగా మారిపోయింది. కాంగ్రెస్ ఏదైతే ఊహించిందో.. అది జ‌ర‌గ‌క‌పోగా.. ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గం ఓట్లు కూడా కేసీఆర్‌కు ప‌డ్డాయి. ఆయ‌న పార్టీ నాయ‌కుల‌కు రెడ్డి వ‌ర్గం మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. దీంతో ప‌రిస్థితి యాంటీ అయింది.


నాగార్జున సాగ‌ర్ నుంచి పోటీ చేసిన జానా రెడ్డికి ఇక్క‌డ రెడ్డి వ‌ర్గం గ‌డిచిన అయిదు ఎన్నిక‌లుగా మద్ద‌తు తెలుపుతోంది. అయితే, ఇప్పుడు ఆయ‌న ఇక్క‌డ నుంచి ఓట‌మి పాల‌య్యే ప‌రిస్తితిలో ఉన్నారు. ఇక్క‌డ నుంచి బ‌రిలో నిలిచిన టీఆర్ ఎస్ అభ్య‌ర్థి నోముల న‌ర‌సింహ‌య్య‌కు ప్ర‌జ‌లు ఓట్లేశారు. రాష్ట్రంలో ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాలు అనేక ఉన్నాయి. నిజానికి అధికార పార్టీని ఢీకొట్టేందుకు స‌రైన వ్యూహంతో ముందుకు వెళ్లి ఉండ‌కుండా కొన్ని సెంటిమెంట్ల‌ను న‌మ్ముకుని ముందుకు వెళ్లిన ఫ‌లితంగా సంప్ర‌దాయంగా ఉన్న ఓటు బ్యాంకును కూడా కాంగ్రెస్ చేజార్చుకుంద‌నే విశ్లేష‌ణ‌లు ఊపందుకున్నాయి. ఇక రెడ్డి వ‌ర్గం నుంచి పోటీ చేసిన డీకే అరుణ గ‌ద్వాల్‌లో, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి న‌ల్గొండ‌లో వెనుకంజ‌లో ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: