తెలంగాణ ఎన్నికల్లో గెలిచేదెవరు.. ఈ ఉదయం వరకూ అందరిలోనూ ఇదే ఉత్కంఠ. ఇప్పుడు ఈ ఉత్కంఠ వీడిపోయింది. టీఆర్‌ఎస్ తిరుగులేని ఆధిక్యత సాధించారు. దాదాపు 90 స్థానాల్లో గెలుపు దిశగా సాగింది. ఈ సమయంలో మహాకూటమి గెలుస్తుందంటూ పోలింగ్ కు 3రోజుల ముందుగానే కలకలం సృష్టించిన లగడపాటి రాజగోపాల్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


జాతీయ ఛానెళ్లన్నీ మళ్లీ కారే అధికారంలోకి వస్తుందని చెప్పాయి. కానీ ఆంధ్రా ఆక్టోపస్ మాత్రం మహా కూటమిదే విజయమని ఢంకా భజాయించారు. మరి లగడపాటి ఏ ధైర్యంతో మహా కూటమివైపు మొగ్గుతున్నాడన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. సర్వేల్లో దిట్టకాబట్టి నిజంగానే మహా కూటమి గెలుస్తుందని చాలామంది అనుకున్నారు.


ఎందుకంటే సర్వేల విషయంలో లగడపాటి రాజగోపాల్ కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. అందుకే అంతా ఆయన సర్వేపై నమ్మకం పెట్టుకుంటారు. ఆ నమ్మకాన్నే మహాకూటమి గెలుపు కోసం లగడపాటి పణంగా పెట్టాడన్న వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. వాస్తవానికి లగడపాటి సర్వే వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఒత్తిడే ఇందుకు కారణమంటున్నారు.


తెలంగాణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు తటస్థ ఓటర్లను కూటమివైపు తిప్పేందుకు లగడపాటితో కుమ్మక్కయ్యాడని విమర్శలు వస్తున్నాయి. పోలింగ్ కు 4 రోజులు ముందు నుంచి లగడపాటితో మహాకూటమిదే గెలుపు అని ముందస్తుగా చెప్పించాడని వారు నమ్ముతున్నారు. ప్రజాకూటమికి గెలుపు సాధించి పెట్టడం ద్వారా జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని భావించిన చంద్రబాబు లగడపాటిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి చంద్రబాబు ఆపరేషన్ లగడపాటి అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: