తెలంగాణలో కారు జోరు కొనసాగుతుంది.  కాంగ్రెస్ మహామహనేతలకు దిమ్మతిరిగే షాక్ తగులుతుంది. ఎన్నో అంచనాల మద్య కూటమి ప్రజల్లోకి వెళ్లినా..ప్రజల నాడి మాత్రం కనుగొనలేక పోయారు. మహాకూటమి తరుపు నుంచి ఏపి సీఎం చంద్రబాబు నాయుడు సైతం ప్రచారం కొనసాగించారు.  తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నల్లగొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరాజయం పాలయ్యారు. టీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి 16,500 ఓట్ల మెజారిటీతో కోమటిరెడ్డిపై ఘనవిజయం సాధించారు.


అంతే కాదు గద్వాలలో కాంగ్రెస్ నేత డీకే అరుణ సైతం ఓటమి చవిచూశారు. కామారెడ్డిలో టీఆర్ఎస్ నేత గంపా గోవర్దన్ చేతిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పరాజయం పాలయ్యారు.  కూకట్ పల్లిలో మాధవరం కృష్ణారావు 28,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. చార్మినార్ నుంచి ఏంఐఎం అభ్యర్థి అహ్మద్ ఖాన్ 32,317 మెజారిటీతో, బహదూర్ పురాలో మౌజంఖాన్ తమ సమీప ప్రత్యర్థులపై ఘనవిజయం సాధించారు.


కాగా, మజ్లిస్ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణ గుట్ట నుంచి ఇప్పటికే 54 వేల  మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. కొడంగల్ లో రేవంత్ రెడ్డి కూడా ఓటమి పాలయ్యారు.  ఇక  సిద్ధిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హరీశ్.. 1,20,650 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థిపై ఘనవిజయం సాధించారు. తద్వారా గతంలో మరెవరికీ సాధ్యం కాని సరికొత్త రికార్డును నెలకొల్పారు.1998లో ఉమ్మడి ఏపీలో గొట్టపాటి నర్సయ్య 1.04 లక్షల మెజారిటీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: