తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మూడున్నర దశాబ్దాల రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి తాను ఏ కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చెయ్యడానికి తెలుగుదేశం పుట్టిందో అదే కాంగ్రెస్‌తో చేతులు కలపడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేదని ఎన్నికల ట్రెండ్స్‌ చెబుతున్నాయి. మహాకూటమి పొత్తుల్లో భాగంగా తెలంగాణ టీడీపీ మొత్తం 13 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఈ 13 నియోజకవర్గాల్లో ఇబ్రహింపట్నం నుంచి పోటీ చేసిన సామ‌ రంగారెడ్డి బరిలో ఉన్నా అదే టైమ్‌లో కాంగ్రెస్‌ నుంచి రెబల్‌గా పోటీ చేసిన మ‌ల్‌రెడ్డి రంగారెడ్డికి ఆ పార్టీ సపోర్ట్‌ చెయ్యడంతో తెలుగుదేశం పార్టీ ఫైన‌ల్‌గా 12 చోట్లే పోటీ చేసినట్టు అయ్యింది. 


ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి రేవూరి ప్రకాష్‌ రెడ్డి, మక్తల్‌ నుంచి కొత్తకోట దయాకర్‌ రెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి ఎర్ర శేఖర్‌, ఉప్పల్‌ నుంచి దేవేందర్‌ గౌడ్‌ తనయుడు వీరేందర్‌ గౌడ్‌, శేరిలింగంపల్లి నుంచి భవ్య ఆనంద్‌ప్రసాద్‌, మలక్‌పేట నుంచి ముజిఫర్‌, కూకట్‌పల్లి నుంచి నందమూరి సుహాసిని, రాజేందర్‌నగర్‌ నుంచి గణేష్‌ గుప్తా, సనత్‌నగర్‌ నుంచి కూన‌ వెంకటేష్‌ గౌడ్‌ పోటీ చేశారు. ముందు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు తాము 7 నుంచి 8 స్థానాల్లో సులువుగా విజయం సాధిస్తామని ధీమాతో ఉన్నారు. పలు సర్వేలు సైతం టీడీపీ ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు గ్రేటర్‌లో ఆధిపత్యాన్ని చూపుతుందని అంచనాలు వేశారు. అయితే కాంగ్రెస్‌తో జట్టు కట్టి బరిలోకి దిగడంతో టీడీపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు టీడీపీకి ట్రన్స్‌ఫర్‌ అవుతుందని... కాంగ్రెస్‌ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు ట్రాన్స్‌ఫర్‌ అవుతుందని రెండు పార్టీల నేతలు ధీమాతో ఉన్నారు. 


అయితే తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో చూస్తే టీడీపీకి దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. తెలంగాణలో టీడీపీకి ఇక నూకలు చెల్లినట్టే కూడా స్పష్టంగా కనపడుతోంది. చంద్రబాబు పట్టుపట్టి మరీ కూకట్‌పల్లి నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినినీ రంగంలోకి దింపగా అక్కడ ఆమె ఓటమి బాటలో ఉన్నారు. అలాగే టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న శేరిలింగంపల్లిలో సైతం టీఆర్‌ఎస్‌ దూసుకుపోతోంది. దేవేందర్‌ గౌడ్‌ తనయుడు వీరేందర్‌ గౌడ్‌ పోటీ చేస్తున్న ఉప్పల్లోనూ ఆయన వెనకంజులో ఉన్నారు. ఇక మహబూబ్‌నగర్‌ జిల్లాలో మహబూబ్‌నగర్‌, మక్తల్‌తో పాటు వరంగల్‌ పశ్చిమలో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయే పరిస్థితిలో ఉంది. 


నామా నాగేశ్వరరావు లాంటి సీనియర్‌ లీడర్లు పోటీ చేసిన ఖమ్మంలోనూ ఆయన వెనకంజ‌లో ఉన్నారు. ఇక టీడీపీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆంధ్రాకు బోడర్‌గా ఉన్న సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో మాత్రమే ముందంజులో ఉంది. సత్తుపల్లి నుంచి ఇప్పటికే వరసగా రెండు సార్లు గెలుస్తున్న సండ్ర వెంకట వీరయ్య అక్కడ మూడో గెలుపుతో హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నారు. ఇక అశ్వారావుపేట నుంచి పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావు సైతం ముందంజులో ఉన్నారు. ఓవర్‌ ఆల్‌గా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రెండు సీట్లతోనూ సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ ఫలితాలను బట్టీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇక పుంజుకోవడం కష్టమేనని ఆ పార్టీకి అక్కడ భవిష్యత్తు లేదన్న అంచనాలు వెలువడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: